చీరాల : యుద్ధరంగంలో గాయపడ్డ సైనికులకు వైద్య సేవలందించి నర్సింగ్ వృత్తికే గౌరవాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నర్స్ లను సత్కరించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొని ఉన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులతోపాటు ముందుండి రోగులకు అత్యవసర వైద్యం అందిస్తున్న నర్సుల కృషి కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ది నర్సింగ్’ గా ప్రకటించారని పేర్కొన్నారు. పిజియన్స్, వైద్యులు రోగిని నయం చేసేందుకు ఇస్తున్న చికిత్సలను అమలు చేయడంలో నర్సులదే కీలక పాత్రని పేర్కొన్నారు. కరోనా వైరస్ వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లతో పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న నర్సుల కృషి అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ చలువాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1854లో జరిగిన యుద్ధంలో గాయపడ్డ సైనికులు, ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వెళ్లిన 35మంది నర్సుల బృందంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలు నర్సింగ్ వృత్తిని ప్రత్యేక విభాగంగా గుర్తించే విధంగా ఉందన్నారు. అప్పటి నుండి నైటింగేల్ పుట్టినరోజు మే 12న ప్రపంచ నర్సింగ్ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని చెప్పారు. నైటింగేల్ స్పూర్తితో రోగులకు వైద్య సేవలు అందించడంలో మానవత, సేవా దృక్పథంతో రోగులకు వైద్యసేవలు అందించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి జనరల్ ఫిజీషియన్, షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరి సురేష్, నర్సులు, ఓపీ సిబ్బంది ఎస్తేరు, స్వాతి, మౌనిక, మంజు పాల్గొన్నారు.