Home ఆంధ్రప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ – ఇప్పుడు బిజెపి

అప్పుడు కాంగ్రెస్ – ఇప్పుడు బిజెపి

415
0

 

– పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ‌ట్లైన ఎపి ప‌రిస్థితి
– రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదు
– వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు పార్టీ అజెండా కాదు
– టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు

అమరావతి : అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ రెండుగా చీల్చి అప్పుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తే ఇప్పుడు బిజెపి నిధులు వాటా, ప్యాకేజీ, హోదా ఏమీ ఇవ్వ‌కుండా అన్యాయం చేస్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోపించారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలను ఏ పేరుతో ఇచ్చినా రాష్ట్రానికి దక్కించుకోవటమే టిడిపి అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రేణులకు సూచించారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని కేంద్రం వివరిస్తేనే తాము ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం వేరే రాష్ట్రాలకు ఎలా ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వటానికే ఇబ్బంది ఎందుకని నిలదీశారు. ఇత‌ర రాష్ట్రాల‌కు ఇచ్చినప్పుడు మనకూ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. హోదానా? లేదా ప్యాకేజీనా? ఏ పేరుతో ఇచ్చినా ఫర్వాలేదన్నారు. హోదాలో ఉన్న ప్రయోజనాలు మాత్రం రాష్ట్రానికి దక్కాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్ర‌బాబు తన నివాస ప్రాంగణంలోని ప్రజా దర్బారు హాల్లో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలను నేతలతో ప్రస్తావించారు. విభజన హామీల పట్ల ఆయా పార్టీల అజెండా ఎలా ఉన్నా మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని పార్టీనేత‌ల‌కు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్నారు. వైసిపి రోజుకో మాట మాట్లాడుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది వైసిపినేన‌ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ఎక్కడా రాజీపడలేదన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా ద్వారా ఏయే ప్రయోజనాలు మన్మోహన్ సింగ్ ఇస్తామన్నారో ఆ ప్రయోజనాలు మనకు దక్కాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రత్యేక హోదాను ఓ సెంటిమెంట్‌గా సృష్టించి ప్రతిపక్ష నేత ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చంద్ర‌బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల నాటకం ఆడుతున్నాడని త‌ప్పుప‌ట్టారు. అవి ఇచ్చాం. ఇవి ఇచ్చాం అంటూ ఈ మధ్య బిజెపి కూడా ప్రకటనలు చేస్తోందన్నారు. బిజెపి నేతలు డిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటా అడగకుండా టిడిపిని ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని తప్పుబట్టారు. అన్యాయాన్ని సరిదిద్దాలన్నది 5కోట్ల మంది ఆంద్ర‌ప్ర‌దేశ్‌ ప్రజల డిమాండని చంద్రబాబు తేల్చి చెప్పారు. మూడేళ్లుగా కేంద్రం నుండి అంతగా సాయం అందకపోయినా ఎక్క‌డా జరగని అభివృద్ధి చేశామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని కేంద్రం చేయాల్సిన‌ సాయం చేయమని భావిస్తే కుదరదన్నారు. మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని సూచించారు. మన కష్టం, మన తెలివితేటలకు ప్రజల సహకారం తోడ‌వ‌టంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా అని ప్ర‌జ‌లు బాధ‌ప‌డి కాంగ్రెస్‌ను వ‌దిలించుకున్నార‌న్నారు. బీజేపీ న్యాయం చేస్తుంది అనుకుంటే బిజెపి కూడా అలానే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయకుండా జాతీయ స్థాయిలో రెండు పార్టీలు ఎలా మనుగడ సాధించగలుగుతాయని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడుతూనే రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పనిచేయాలని నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విమర్శలకు ప్రతి విమర్శ చేయ‌డం త‌మ‌ పార్టీ అజెండా కాదన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించే దిశగా సాగాలని సూచించారు. అవిశ్వాస తీర్మానానికి 54మంది మద్దతు కావాలన్న ఆయన కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేరతాయని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.