– వైసిపీ ప్రభుత్వంకు ఇప్పటి ప్రభుత్వంకు తేడా ఏమిటి?
– అప్పుడు, ఇప్పుడు బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
– చేసిన పనులకు బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు
– నిధుల మళ్లింపులో వైసిపి బాటలో కూటమి ప్రభుత్వం
– విమర్శలు ఎదుర్కొంటున్న నగరపాలక సంస్థ
ఒంగోలు (DN5 News) : రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పుల పైన అప్పులు చేస్తున్నారనే విమర్శలు ఒకవైపు వెల్లువెత్తుతుంటే ఒంగోలు నగరపాలక సంస్థ ఒక అడుగు ముందుకు వేసి అప్పుల బాట పట్టింది.
నగర పాలక సంస్థ కాంట్రాక్టర్లకు రు.40 కోట్లు అప్పు పడి ఆ తిప్పల్ని తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసిందనే వాదన వినిపిస్తుంది. దీనికి ‘కాంట్రాక్టర్లకు తీపి కబురు’ అనే పేరు పెట్టింది. అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధి పోర్టల్ ద్వారా డబ్బులు వేసినప్పటికీ కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉంటే దానిపైన ఒంటి కాలిపైన లేచిన కూటమి నేతలు ఇప్పుడు సాంకేతిక సమస్యల వల్ల రావట్లేదు అంటూ తమ అప్పుల కుప్పని, డబ్బులు లేని తనాన్ని పక్కదారి పట్టిస్తున్నారానే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన చెక్కుల మొత్తాన్ని సిఎఫ్ఎంఎస్ నేడు నిధి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించుకుంటూ కాంట్రాక్టర్ల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నది. ప్రభుత్వం నుంచి తమ డబ్బుని తెప్పించుకోలేని పరిస్తితిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒంగోలు కార్పొరేషన్లో దీనికో కొత్త తొడుగు తొడిగి కాంట్రాక్టర్లకు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని చేబ్బుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ అప్పులు తీసుకొని వడ్డీ కట్టుకుంటూ రు.100 పనికి రు.50 పనే చేసి మీరు డబ్బులు సంపాదించుకోండి, దానికి మా కార్పొరేషన్ సహకరిస్తుందని బాహాటంగా చెబుతున్నారు.
దీనికి కార్పొరేషన్లో జరుగుతున్న కోకొల్లల పనులను ఉదాహరణగా చెప్పవచ్చు. ఏ పనైనా 50శాతం చేస్తే చాలు. 20శాతం కమిషన్లు, మిగిలిన 30శాతం కాంట్రాక్టర్ కి. ఎందుకంటే కాంట్రాక్టర్ కి డబ్బులు ఇప్పుడు రావు కదా. సంవత్సరం తర్వాత జరిగే తంతు ఇదేనానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకి మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన కాలువను కార్పొరేషన్ నిధులతో సిల్ట్ తీస్తున్నారు.
ఆ పనికి రు.10 లక్షలు చొప్పున తీసుకుని చేసుకుంటూ పోతున్నారు. ఏం పని చేస్తున్నారు? ఎంత చేస్తున్నారు? ఎవ్వరికి తెలియదు. రు.కోటి వరకు డబ్బులు డ్రా చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ఏటీఎం. దీనికి ఎమ్మెల్యే కితాబు. సమయానికి సిల్ట్ తీయడం వలన వరదలను నివారించామని, కానీ జరిగిన పని ఎంత? డ్రా చేసేది ఎంత? అసలు ఆ పనిని ఎవరు చేయాలి అనేది దేవుడికి తెలియాలి.
ఏదేమైనా కాంట్రాక్టర్లకు పనులు చేస్తే డబ్బులు రావనేది అందరి కాంట్రాక్టర్లకు అర్థమైపోయింది. ప్రభుత్వం ఏదైనా విషయం ఒకటే. దీన్ని సాధించలేక వేరే పేరు పెడుతున్నారు. ఏదైనా కార్పొరేషన్లో డబ్బులు లేవు. ఇచ్చిన చెక్కులకి డబ్బులు రాలేదు. ఇంకా దాదాపు రు.30 కోట్లు వివిధ కాంట్రాక్టర్లకు ఇవ్వవలసి ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ నిర్వాకం వల్ల వర్కర్లను ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగిస్తూ కొత్త వాళ్ళని తీసుకుంటూ రు.కోట్ల నిధులు అనుత్పాదక పనులకు ఖర్చు పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.






