Home ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక నయీ తాలిమ్ విద్యా విధానం

రాష్ట్రంలో ఇక నయీ తాలిమ్ విద్యా విధానం

615
0

బాపట్ల : నయీ-తాలిమ్ విద్యా విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సును బాపట్ల మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించారు. గాంధీ మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సెమినార్ లో మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్యా విధానం దిశగా అడుగులు వేయాలని అన్నారు.

విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు మహాత్మా గాంధీ ప్రతిపాదించిన “నయీ తాలిమ్” విద్యా విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సులో సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు హాజరయ్యారు. 27, 28తేదీలలో జరిగే సదస్సుకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, జాతీయ గ్రామీణ విద్యా మండలి అధ్యక్షులు డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా మండలి, ఎస్సీఈఆర్టీ, రూరల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ల సమన్వయంతో జరిగే సదస్సులో పని ఆధారిత విద్య, విలువలు, నీతిగల పౌరసత్వం, 21వ శతాబ్దంలో విద్య ద్వారా సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు.

మంత్రి సురేష్ మాట్లాడుతూ విద్య అనేది డిగ్రీలు, మార్కులు ప్రాతిపదికన లెక్క వేయకూడదన్నారు. విదేశాలకు వెళ్లి డాలర్లు సంపాదించి పెట్టేది మాత్రమే విద్య కాదని, సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు విద్య దోహదం చేయాలని సూచించారు. సామాజిక మార్పుకోసం, సమాజంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. సెమినార్ లో రెండు రోజుల వ్యవధిలో సరైన అవగాహన కల్పించాలని సూచించారు. మేధో మథనం జరగాలని, నూతన విద్యా విధానంలో మార్పుకోసం తగిన సూచనలు చేయాలని కోరారు. విద్య వ్యాపారం కోసం కాదనీ విలువైన వనరుగా దాన్ని అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మార్పుకోసం చేసే ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగాలంటే సరైన రీతిలో మీ సహకారాన్ని అందించాలని అన్నారు. చదువుకోవడం ఆటలా సరదాగా సాగాలని ఆనంద వేదిక, నో స్కూల్ బ్యాగ్ డే వంటి సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సమూహ కృత్యాలు చిన్నారులతో కలిసి చేయాలని కోరారు. పాఠశాలల స్థితిగతుల మార్పుకోసం కృషి చేస్తామన్నారు. గురువును మించినదిగా గూగుల్ మారిందని చమత్కరించారు. కమ్యూనికేషన్ లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆకళింపు చేసుకొని ఉపాధ్యాయులు తమ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకొనేందుకు కృషిచేయాలని కోరారు. విద్యా, వైద్యం కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేసేందుకు మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కాంతారావు, ఈశ్వరయ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రెండు రోజుల సెమినార్ లో ప్రతినిధులు సూచించిన వాటిని పరిగణించి మార్పులు చెయ్యడానికి సిద్ధమని హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బుడితి రాజశేఖర్, విశ్వనాధప్ప, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, డాక్టర్ సీఏ ప్రసాద్ పాల్గొన్నారు.