అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తొలిమహిళ నీలం సహాని గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా జారీ చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపవర్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారి మహిళలకు ఆంద్రప్రదేశ్‌లో అవకాశం వచ్చినట్లైంది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు. టెక్కలి సబ్ కలక్టర్ గాను, నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. నిజామాబాదు జిల్లా డిఆర్డిఏ పిడి గాను, ఖమ్మం జిల్లాల్లో కాడా (CADA) అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలక్టర్ గాను, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా, టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. క్రీడల శాఖ కమీషనర్ మరియు సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం, ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు సతీనాయర్, మిన్నీ మాధ్యూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని బాధ్యతలు చేపట్టారు.