జాతీయ స్థాయి దళిత ఉద్యమ నేతగా ఆనందరావు

    819
    0

    ఒంగోలు : దళిత హక్కులు, సామాజిక మార్పుకోసం అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని పునికిపుచ్చుకుని, జాతీయ స్థాయి ఉద్యమ నిర్మాణానికి అలుపెరుగని పోరాటం జరిపిన అణగారిన కులాల గొంతుక కారుమంచి పోరుబిడ్డ, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు. 1 జులై 1964లో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలోని నిరుపేద దళిత కుటుంబంలో నర్సయ్య, చిన్న అంకమ్మలకు ఆరవ సంతానంగా జన్మించారు. ఆనందరావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి, 6 నుండి 8వ తరగతి వరకు సింగరాయకొండ మండలం పాకల ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ అక్కడి స్కూల్ లో చదివాడు. 9,10 తరగతులు కారుమంచిలో చదివారు. కావలి జవహర్ భారతీ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. డిగ్రీ జవహర్ భారతి కాలేజీలో చదివారు. జవహర్ భారతీకాలేజీ ఆయన ఉద్యమ జీవితానికి బీజం వేసింది. కాలేజీలో వాలీబాల్ క్రీడలో మంచి ప్రతిభ ప్రదర్శించేవాడు. మరో ప్రక్క ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడియస్ యు) ఉద్యమాలలో కంజెర, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, జజ్జనకరే జనారే లాంటి పాటలు పాడుతూ, నృత్యాలు ప్రదర్శిస్తూ విద్యార్థులను చైతన్య పరుస్తూ చురుకుగా విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు.

    తన ఇంగ్లీషు ప్రతిభతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షించేవాడు. అనంతరం గుంటూరులో మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేశారు. వాలీబాల్ అంటే ఎంతో మక్కువ. టంగుటూరులో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ స్థానిక పెట్రోలు బంకు యజమాని పమిడి బాబురావు వాలీబాల్ లో శిక్షణ ఇస్తుంటారు. ఆనందరావు వాలీబాల్ నేర్చుకోవడం కోసం బాబురావు పెట్రోలు బంకులో పనిచేస్తూ ఆయన వద్ద వాలీబాల్ క్రీడలో నైపుణ్యాన్ని సంపాదించారు. అదే సమయంలో టంగుటూరులోనే టైపులో శిక్షణలో ప్రావీణ్యత సాధించారు. అనంతరం ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయ (పిఈటి)శిక్షణ పొందారు.1988 నుండి 94వరకు కారుమంచి గ్రామ అంబేద్కర్ యువజన సంఘంలో పనిచేశారు. ఆ సమయంలోనే అంబేద్కర్ గోల్డ్ కప్, ఆలిండియా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి జాతీయ స్థాయి క్రీడాకారులను కారుమంచి గ్రామానికి రప్పించి నభూతోనభవిష్యత్ అన్నట్లుగా విజయవంతం చేశారు. అదే విధంగా ప్రతియేడు రాష్టస్థ్రాయిలో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామంలోని యువకులను చైతన్య పరుస్తూ గ్రామస్థుల ఆదరాభిమానాలను పొందారు. అలాగే జిల్లా స్థాయి అధికారులకు, నాయకులకు దగ్గరయ్యారు. అదే చొరవతో అసిస్టు సంస్థ ద్వారా గ్రామంలో సిమెంటు రోడ్లు, పక్కాగృహాల నిర్మాణం, క్రీడాప్రాంగణం అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేశారు.

    1986లో టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె పద్మను న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు శ్రీకాంత్, ఇంకో కుమారుడు అనారోగ్యంతో మృతిచెందారు. కొన్నేళ్ళకు మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం చీరాలకు చెందిన సునీతను వివాహం చేసుకున్నారు. వారికి శశికళ జన్మించింది.1988లో ఢిల్లీ చేరారు. తన సమీప బంధువు సేవాస్థంబు వ్యవస్థాపకులు, ఆ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్, సోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు, స్వర్గీయ మాజీప్రధాని ఇందిరాగాంధీ పర్సనల్ సెక్రెటరీ రాయిపూడి సంగీతరావు ఢిల్లీలో అంబేద్కర్ భవన్ (బాపూ భవన్)లో తాత్కాలిక ఉద్యోగిగా చేరారు. మూడేళ్ళ అనంతరం క్లర్క్ అండ్ టైపిస్టుగా పరీక్ష రాసి ఆంధ్రా భవన్ లో ప్రభుత్వ ఉద్యోగిగా చేరి డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగారు. ఆలిండియా అంబేద్కర్ యూత్ అసోషియేషన్ జాతీయ అధ్యక్షులుగా, సేవాస్థంబు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి చేతులమీదుగా నేషనల్ హానెస్ట్ ఆఫీసర్ అందుకున్నారు.

    ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రావీణ్యతతో ఆకర్షించే తన మాటలతో ఆంధ్రా, ఇతర రాష్ట్రాల నుండి డిల్లీకి వచ్చే అధికారులతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పేవారు. ఆంధ్రా భవన్ లో ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ ఏపీ భవన్ దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం కృషిచేస్తూనే మరోపక్క ఆలిండియా దళిత హక్కుల వేదిక(ఎఐడిఆర్ఎఫ్) స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఉత్తర భారతనంలోనూ దళితుల, దళిత ఉద్యోగుల సమస్యలపైన అనేక ఉద్యమాలను నిర్మించాడు.

    దళిత హక్కుల ఉద్యమంలో అనేక జాతీయ, రాష్ట్రస్థాయి సామాజిక సంస్థలతో కలిసి ఉద్యమించాడు. బీజేపీ పాలనలో దళితుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి బీజేపీ ప్రభుత్వం మనుస్మృతిని అమలుచేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అట్రాసిటీ చట్టం పరిరక్షణకై వివిధ దళిత సంఘాలతో కలిసి జాతీయ స్థాయి ఉద్యమానికి కృషి చేశారు. ఈక్రమంలో జరిగిన భారత్ బంద్ కు మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ ఉద్యమం ఫలితంగా ఫునసమీక్షించుకోవడమే కాకుండా, మరింత పదునుగా ఆ చట్టం రూపుదాల్చింది.

    ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అణగారిన కులాల హక్కని చాటి, వాటి అమలు కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. గరగపర్రులో దళితులు ఆత్మగౌరవంతో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహం పాత పంచాయితీ వద్దే ఉండాలని ఉద్యమించి, హైకోర్టులో కేసు వేశారు. నెల్లూరు జిల్లా రాపూరు దళితులకు, శిరోముండనం కేసులో దళిత యువకుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. 2018జులైలో కడప నుండి శ్రీకాకుళం వరకు కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట సాక్షిగా బహుజన చైతన్య రథయాత్రను ప్రారంభించారు. అత్యాచారాలు, హత్యలు, దాడులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కలిసి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ముంబైలో అంబేద్కర్ నిర్మించుకున్న రాజాగృహపై దాడి చేయడాన్ని అన్ని రాష్టాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యం సహకరించకున్నా తనూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను సిఐడీకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య, అమలాపురం జిల్లాను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంగ్లీషు భాషను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. హిందువుగా పుట్టినా, హిందువుగా చావను అన్న అంబేద్కర్, తాను ఆచరించినట్లుగానే పుట్టినగడ్డ పురిటిగడ్డ కారుమంచి గ్రామంలో 2015 జనవరిలో అంబేద్కర్ ఆశయాలు-బౌద్ధం అనే అంశంపై మూడురోజుల పాటు సెమినార్ నిర్వహించారు. అదే కార్యక్రమంలో బౌద్ధబిక్షువు ద్వారా బౌద్ధమతాన్ని స్వీకరించి నేను హిందువును కాదని ప్రకటించుకుని అంబేద్కర్ వాదులకు ఆదర్శంగా నిలిచారు.

    ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ తన ఆరోగ్యం క్షీణ దశకు వచ్చిందని, ఒక కిడ్నీతోనే బతుకుతున్నానన్నారు. ఇలా ఎంతకాలం జీవిస్తానో తెలియదు. నేను హిందువుగా కాక బౌద్ధునిగా నిష్క్రమించాలన్నది నా కోరిక అని ప్రకటించుకున్నాడు. చావు తన దగ్గరకు వచ్చేంత వరకు అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తానని ప్రకటించారు. అంబేద్కర్ యువజన సంఘంతో ప్రారంభమైన ఆనందరావు క్రియాశీల ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయి దళిత హక్కుల వేదిక ఉద్యమ నిర్మాతగా ఎదిగాడు. వివిధ రాష్టాలలో దళిత ఉద్యమాల వేదికను విస్తరించడానికి కృషి చేశాడు. అన్నిరంగాలలో మనువాద, కార్పొరేట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దళిత హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించే క్రమంలో మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా వైద్యశాలలో చికిత్స పొందుతూ 2020 డిసెంబర్ 31 తుదిశ్వాస విడిచారు. తన స్వగ్రామమైన కారుమంచిలో రాష్టవ్య్రాప్తంగా విచ్చేసిన దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, బౌద్ధమత గురువుల ఆధ్వర్యంలో మృతదేహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి బౌద్ధ సిద్ధాంతం ప్రకారం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.