Home ఆంధ్రప్రదేశ్ నరవాడ శ్రీమంతుడు కరుణాకర్ బాబు

నరవాడ శ్రీమంతుడు కరుణాకర్ బాబు

926
0

– కరుణాకర్ బాబు చొరవతో నరవాడకు మహర్దశ
– సర్వాంగ సుందరంగా వెంగమాంబ ఆలయం
– రూ.25కోట్లతో అభివృద్ధి పనులు

ఉదయగిరి : నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సరిహద్దులో ఉన్న నరవాడ గ్రామం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుపరిచితమే. అక్కడి ప్రజలు కూలీనాలీ చేసుకుని బతుకుబండిని లాగుతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామానికి ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని తానే అభివృద్ధి చేయాలనుకున్నాడు. సొంత నిధులతోపాటు తన మిత్రుల సహకారంతో రూ.25 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపటీ నర్రవాడ శ్రీమంతుడుగా నిలిచాడు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నర్రవాడ. ఈ పేరు వింటేనే ఆధ్యాత్మికత పొంగిపొరాలుతుంది. భక్తులు అమ్మవారి దర్శనంతో పారవశ్యంలో మునిగి పోతారు. భక్తుల కొంగుబంగారంగా పిలవబడే శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు కొలువై ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితమే. రాష్ట్రంలోనే 3వ ఉత్సవంగా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయము నిన్నటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన ఎంతో మంది దేశ విదేశాల్లో వ్యాపార ఉద్యోగాలు స్థిరపడి కోటీశ్వరులుగా స్థిరపడ్డారు. అంతేకాకుండా మంత్రులుగా చేసిన వారు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. కానీ దేవాలయం అభివృద్ధిపై వీరు చేపట్టిన చర్యలు నామమాత్రమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆలయానికి నిన్నటి వరకు ఎంతోమంది చైర్మన్లుగా వ్యవహరించారు. వారంతా తాము శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవాలయానికి చైర్మన్ గా చెప్పుకోవడానికే సమయం సరిపోయిందనే విమర్శలు ఉన్న సమయంలో నర్రవాడ మజరా వడ్డీపాలెం గ్రామానికి చెందిన పచ్చగా వెంగయ్య (అద్దాల వెంగయ్య) కుమారుడు కరుణాకరబాబు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియామకమయ్యారు.

జీవనోపాధి కోసం తన చిన్నతనంలోనే వలస జీవితం ప్రారంభించి విశాఖ పట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకొని దేశవిదేశాలలో వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడిన కరుణాకర బాబు ఎప్పుడో ఏడాదికి ఒకసారి చుట్టపుచూపుగా వచ్చి పోతుండేవారు. ఆయనకు తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో చేయాలనే కోరిక మదిలో మెదిలింది. రాష్ట్రంలోని పేరుప్రఖ్యాతులు గాంచిన శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండటం చూసి చలించిన కరుణాకరబాబు ఇదే తనువుగా ఆలయ పరిస్థితులతో పాటు గ్రామ పరిస్థితులను అక్కడే ఉండి పరిశీలించారు. ఎక్కడ చూసినా పేదరికం. ఏ వీధి చూసినా దుర్గంధభరితం. తాగేందుకు శుద్ధి జలాలు లేవు. ఊరంతా వెనుకబాటుతనం. తాను సంపాదించిన దానిలో కొంతైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్న కరుణాకర బాబు రూ.25కోట్లతో నర్రవాడ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.

జన్మనిచ్చినఊరిలో శ్రీమంతుడుగా కాలుపెట్టిన కరుణాకరబాబు పబ్లిసిటీకి రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటాడు. గ్రామంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని తద్వారా ఉపాధి మెరుగవుతుందని భావించాడు. గ్రామంలో కొద్దో గొప్పో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న నిరుపేదలను కొంతమందిని గుర్తించి నర్రవాడలోనే ఉపాధి అవకాశాలు కల్పించారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారి వివాహాలకు, అనారోగ్య సమస్యలు వచ్చిన వారి పిల్లలకు చదువుకునేందుకు తనకు చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తు ఆ వూరి శ్రీమంతుడు అయ్యారు. ఇకపోతే మెట్ట ప్రాంతపు ఆరాధ్య దైవంగా పిలవబడే శ్రీ వెంగమాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధిపై దృష్టి పెట్టిన కరుణాకర బాబు ప్రధాన దేవాలయము, హోమగుండం, పొంగళ్ల శాల, భక్తులు వరపడే గది, కళ్యాణకట్ట, అలాగే దొడ్డా కొండను శుభ్రం చేసి, కొండపైన అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా చేయాలన్న తపనతో కొండను పగలగొట్టి రాకపోకలకు రహదారిని నిర్మించారు.

అలాగే వ్యవసాయ భూముల్లోకి రహదారి, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, కొబ్బరి గుండం, సంతానలక్ష్మి అతిథి గృహం, ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయం నిర్మాణం, ప్రతిరోజు నిత్య అన్నదానం, కేవలం రూ.100లకే పేదలకు వసతి సదుపాయం, గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల ఖర్చు చేసిన కరుణాకర బాబు మరో రూ.15 కోట్లు ఖర్చుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా కొంత మొత్తం ఖర్చు చేస్తూ తనకు తెలిసిన వారితో మరి కొంత ధనం ఖర్చు పెట్టిస్తూ విరాళాలు సైతం సేకరిస్తూ ఆలయ రూపురేఖలు మార్చారు. ఈయన చేస్తున్న అభివృద్ధి పనులకు తాను సైతం అంటూ పంచాయతీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తులను ఏకం చేయడంలో పంచాయతీ కార్యదర్శి గంగవరపు శ్రీధర్ చౌదరి తన వంతు సహకరిస్తున్నారు. ఇలా గ్రామాభివృద్ధిలో తనదైన ముద్రవేసుకున్న కరుణాకర్ బాబు ఆదర్శంగా నిలిచారు.