చీరాల : మున్సిపల్ పారిశుద్య కార్మికురాలు వేశపోగు వసంత ఆదివారం వేకువజామున ఐఎల్‌టిడి కంపెనీ సమీపంలో పారిశుద్య పనులు నిర్వహిస్తుండగా బాపట్ల వైపు నుండి చీరాల వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో కార్మికురాలు రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోగా ఆటో ఫల్టీలు కొట్టింది. వెంటనే గమనించిన తోటి కార్మికులు గాయపడ్డ కార్మికురాలిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పారిశుద్య పనుల కాంట్రాక్టర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఎవ్వరూ ఆమెను కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదు.
పారిశుద్య కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు ఆరోపించారు. ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న కార్మికురాలిని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో 279జిఒ అమలు ఫలితంగానే అధికారులు, కాంట్రాక్టర్ ఇద్దరూ కార్మికులను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు వచ్చాయని చెప్పుకునే అధికారులు అవార్డులు రావడానికి కష్టం చేసిన కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలికి అయ్యే వైద్యఖర్చులు మొత్తం మున్సిపాలిటీ, కాంట్రాక్టర్ భరించాలని డిమాండు చేశారు.