చీరాల (DN5 News) : ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ఎక్స్‌అఫీషియో సభ్యునిగా హాజరై మాట్లాడారు. చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.70.67 కోట్ల అంచనా బడ్జెట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రూ.21.26 కోట్ల ప్రారంభ నిల్వతో రూ.70.67 కోట్ల ఆదాయం, రూ.69.72 కోట్ల వ్యయం, రూ.22.20 కోట్ల ముగింపు నిల్వ బడ్జెట్ ప్రతిపాదించారు.
వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య బడ్జెట్‌ను ప్రతిపాదించగా సభ్యులు మద్దతు తెలిపారు. అత్యవసర సమావేశం అజెండాలోని 118 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. వైసీపీ కౌన్సిలర్ ప్రభాకర్ బడ్జెట్‌లో వివరాలు పూర్తి స్థాయిలో పొందుపరచలేదని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్లు వినియోగించకపోవడంతో అవి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్‌తో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్యం సరిగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చాలని అన్నారు. రోడ్లు నిర్మించాలని కోరారు.
శ్మశానవాటికల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఫైర్ ఆఫీసు సమీపంలోని రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం అవసరమని అన్నారు. కౌన్సిలర్ గోలి స్వాతి, తోకల అనిల్ మాట్లాడుతూ గడియార స్తంభం సెంటర్లో షాపులకు అద్దెలు అధికంగా ఉండటంతో 15 షాపులు ఖాళీగా ఉన్నాయని, మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోందని అన్నారు. కాంప్లెక్స్ పైన ఉన్న రావు గారి బిర్యాని రెస్టారెంట్ అద్దె బకాయిలు చెల్లించలేదని ప్రస్తావించారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
దీనిపై ఆర్ఓ మాల్యాద్రి మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే బకాయి మొత్తం జమ చేశారనతి తెలిపారు. రూ.9లక్షల నగదు, మిగిలినది చెక్కులు ఇచ్చారని తెలిపారు. కౌన్సిలర్ గోలి జగదీష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయాలని అన్నారు. కౌసల్ బత్తుల అనిల్ మాట్లాడుతూ విజిలీపేటలో ఉన్న హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు దానిని ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై డిఈ రఘురాం మాట్లాడుతూ స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన యంత్రాలకు బిల్లులు కాంట్రాక్టర్‌కు రాలేదని, బరియల్ మిషనరీను పూర్తిస్థాయిలో టెస్ట్ ట్రయల్ చేశాక అప్పగిస్తారని, ఆదిశగా అధికారులు ఆలోచనా ఈపాటికే చేశారని అన్నారు.
ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కౌన్సిలర్ల పదవీకాలం ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో నూతన పాలకవర్గం ఏర్పడే వరకు కమిటీగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పట్టణ సమస్యలు సిఎం చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు.






