Home ప్రకాశం మారుతున్న మార్కెట్ కు అనుగుణంగా వ్యాపార దృక్పథం మారాలి : ఏపీఎస్ఎఫ్సి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్...

మారుతున్న మార్కెట్ కు అనుగుణంగా వ్యాపార దృక్పథం మారాలి : ఏపీఎస్ఎఫ్సి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు

250
0

ఒంగోలు : ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో మారుతున్న మార్కెట్ కు అనుగుణంగా వ్యాపార వేత్తలు తమ వ్యాపార దృక్పధాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎస్ఎఫ్సీ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం మానవ అవసరాలు వేగంగా మారుతున్నాయని చెప్పారు. ఫార్మా రంగంతో పాటు ప్రజల ఆహార అలవాట్లు మారుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీఎస్ఎఫ్సీ ఆధ్వర్యంలో శనివారం మార్టూరులో ఏర్పాటు చేసిన బిజినెస్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీఎస్ఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, ఎంటర్ప్రెన్యూర్ స్కీం, ఎస్సీ, ఎస్టీల కోసం అమలవుతున్న ఎమ్మెస్ఎంఈ పథకం గురించి శ్రీనివాసరావు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో మెగా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉందన్నారు. ఏపీఎస్ఎఫ్సీ కార్యక్రమంలో ఫెసిలిటేషన్ సెంటర్ తోపాటు ఇంజనీరింగ్, లీగల్ తదితర విభాగాలు ఉన్నాయని చెప్పారు. రుణ సౌకర్యం పొందేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

పరిశ్రమల శాఖ ఐపీఓ ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామిక సర్వే జరుగుతున్న తీరును వివరించారు. ఇటీవల రాయితీల విడుదలలోనూ, రీస్టార్ట్ కార్యక్రమంలోనూ జిల్లా పరిశ్రమల శాఖ శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు చెప్పారు.

ఫ్యాప్సీయా రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వి భక్తవత్సలం మాట్లాడుతూ స్టాండ్ అప్ ఇండియా, పిఎంఈజిపి లతోపాటు నాబార్డు నుండి అమలు జరిపే ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. 2020 – 2023 పాలసీలో మూడు సంవత్సరాల తరువాత రాయితీలు ఇవ్వడం సరికాదని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని ఫ్యాప్సియా కోరిందన్నారు. ఆత్మ నిబ్బర భారత్, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సబ్సిడీలు ఎమ్మెస్ఎంఈలను కొంతమేరకు బతికించాయన్నారు. అనంతరం ఏపీ ఎస్ఎఫ్సి బిఎం శ్రీనివాసరావును సన్మానించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఏడి ప్రసన్నలక్ష్మి, మార్టూరు గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, నర్రా శేషగిరిరావు, రంగారావు పాల్గొన్నారు.