Home ఆంధ్రప్రదేశ్ అర్ధరాత్రి ‎ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ ఆకస్మిక తనిఖీ

అర్ధరాత్రి ‎ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ ఆకస్మిక తనిఖీ

34
0

– రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా
– రోగులకు తన విజిటింగ్ కార్డు అందజేత
– సుమారు 45నిమిషాలు హాస్పిటల్‌లో పర్యటన
‎‎ఏలూరు (Eluru) : ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11.30 సమయంలో ఆసుపత్రికి వచ్చిన ఆయన దాదాపు 45 నిమిషాలు అన్ని విభాగాలు కలియ తిరిగారు. పలువురు రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

పలువురు రోగులు, వారి సహాయకులకు తన ఫోన్ నెంబర్‌తో కూడిన విజిటింగ్ కార్డు స్వయంగా ఇచ్చారు. సరైన వైద్యం అందకపోయిన, ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, అందరి ముందు చెప్పుకోలేని సమయాలు తనకు నేరుగా ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు.

ఐసీయూ, అత్యవసర విభాగం, జనరల్ వార్డ్, మహిళా ప్రసూతి విభాగం, పిల్లలు, తల్లులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. రాత్రి డ్యూటీ రిజిస్టర్ తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది వివరాలు అడిగి  తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందించే మెడిసిన్స్ తనిఖీ చేసారు.

డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులతో మాట్లాడుతు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి సిబ్బంది కొరత పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.