విజయవాడ : గవర్నర్ కావాల్సిన వ్యక్తి ఇప్పుడు పార్టీ నుంచే బహిష్కరణకు గురయ్యారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడని టీడీపీలో గీత దాటేసి ఏకంగా అధ్యక్షుడు చంద్రబాబు మీదే ఆరోపణలు గుప్పించిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుపై ఆ పార్టీ నేతలు చర్యలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వీడక ముందు నుంచి మోత్కుపల్లి పార్టీ వ్యతిరేక కలాపాలకు పాలపడుతున్నారు. టీడీపీని టిఆర్ఎస్ లో కలపాలని మాట్లాడి తన రహస్య అజెండాను మోత్కుపల్లి బయట పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్లాలని భావిస్తున్నా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అందుకే టీడీపీని చంద్రబాబుని తిడితే కేసీఆర్ అక్కున చేర్చుకుంటారని భావించి ఆయన చీప్ ట్రిక్స్ ప్లై చేసారని ఒక ప్రచారం ఉంది. అయితే ఆయన అసంతృప్తి మొత్తానికి కారణం బీజాయ్ ఇస్తానన్న గవర్నర్ పదవి ఇవ్వకపోవడమేనని చెబుతున్నారు. మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ మీద చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
అయినా మోడీ మాత్రం మనసులో వేరే పెట్టుకుని టీడీపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ క్రమంలోనే పదవి రాలేదన్న అక్కసుతో మోత్కుపల్లి సొంత పార్టీ మీదనే విమర్శలు చేసారు. ఈ రోజు అయితే పరిధులు దాటి విమర్శలు చేసారు. బీజేపీ, వైసీపీ, జనసేన, టిఆర్ఎస్ నేతలను మించి మోత్కుపల్లి మాట్లాడారు. దాంతో టీడీపీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆ వెంటనే చర్యలకు ఉపక్రమించింది. టీటీడీపీ నుంచి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరించినట్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. గత ఆరు నెలలుగా జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇవాళ ఎన్టీఆర్ ఘాట్‌లో మోత్కుపల్లి ప్రవర్తన కుట్రపూరితంగా.. పార్టీని బలహీనపర్చేదిగా ఉందని ఆరోపించారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం చంద్రబాబు చొరవచూపారని చెప్పారు. అయితే తమిళనాడు గవర్నర్ పదవిని మోత్కుపల్లి కోరారన్నారు. కానీ కేంద్రం గవర్నర్ పదవి ఇవ్వలేదని తెలిపారు. నిరాధార ఆరోపణలతో టీటీడీపీని బలహీనపర్చి.. కేసీఆర్‌కు మోకరిల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. విపరీత ధోరణితోనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశంతో అనుబంధం ఉన్న నాయకుడని.. చాలా సార్లు ఆయన మాటలను పట్టించుకోలేదన్నారు.
గతేడాది విజయదశమి నుంచి మొదలు పెట్టి ఇవాళ ఎన్టీఆర్ జయంతి వరకు ఆయన కార్యక్రమాలన్నీ పార్టీని పూర్తిగా బలహీనపరిచేదిగా ఉందన్నారు. ఇది మంచిపద్ధతి కాదని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాజిక న్యాయంకోసం.. అణగారిన వర్గాల కోసమన్న రమణ… దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి చంద్రబాబని చెప్పారు. ఇంత వరకు ఆయనలో మార్పు రాకపోయినా.. టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఎన్టీఆర్‌తో పోల్చి చెప్పడం ఎంతవరకు సబబో మోత్కుపల్లి నరసింహులు చెప్పాలని రమణ నిలదీశారు.