Home జాతీయం కేదార్ నాద్ ను నేనేమీ కోరలేదు… ఎక్కువే ఇచ్చారు : మోడీ

కేదార్ నాద్ ను నేనేమీ కోరలేదు… ఎక్కువే ఇచ్చారు : మోడీ

527
0

కేదార్‌నాథ్: ప్రకృతి, పర్యావరణం, పర్యాటకంపై దృష్టి సారించడమే ప్రస్తుతం తన మిషన్ అని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖంఢ్‌లోని కేథార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆదివారం ఉదయం మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కష్టించి పనిచేసే టీమ్ దొరకడం తన అదృష్టమని అన్నారు. ఇక్కడ పర్యాటకం పెరడానికి తోడ్పాటు అందిస్తున్న మీడియాకు సైతం కృతజ్ఞతలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిని తాను తరచు సమీక్షిస్తుంటానని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రార్థించారా అని అడిగినప్పుడు ‘బాబా కేదార్‌నాథ్‌ను నేను ఏమీ కోరలేదు. అడిగిన దాని కంటే భగవంతుడు ఎక్కువగానే మనకు ఇచ్చాడు’ అని ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. దేశ ప్రజలు యావత్ భారతాన్ని సందర్శించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. ప్రజలు విదేశాలు చూడాలంటే తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అయితే దేశంలోని విభిన్న ప్రాంతాల్లో కూడా వారు పర్యటించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

కేదార్‌నాథ్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు ఆయన చెప్పారు. 2013వరదలు తర్వాత ఈ ప్రాంత పునర్ అభివృద్ధికి తాను ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిచానని చెప్పారు. కాగా ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజవర్గంలో చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఇవాళ ఓటింగ్ జరుగుతోంది.