– గుజరాత్ అల్లర్లపై గళమెత్తిన తొలి గొంతు చంద్రబాబు
– నేడూ ఎన్డీయేకు మొదటి షాక్ కొట్టిన నేత చంద్రబాబు
– గుజరాత్ అల్లర్లలో మోడీని పదవినుండి తొలగించాలని పట్టుబట్టిందీ చంద్రబాబే
– బాబుపై పగతో తెలుగు ప్రజలకు అన్యాయం
న్యూఢిల్లీ : అది 2002. యావత్ భారత దేశం ఆవేదన చెందిన సంవత్సరం. సకల మతాలు, ఆచారాలకు నిలయమైన దేశంలో అల్లకల్లోలమైన ఘటన గుజరాత్ మారణహోమం. అంతటి ఘటనకు కారణమైంది ఎవరో కాదు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్రమోడీ. అప్పట్లో వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి – ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పటి ఎన్‌డిఎలో 28మంది ఎంపిలతో చంద్రబాబు కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. అంతటి మారణ హోమాన్ని సైతం కారు కిందపడి కుక్క చనిపోయినట్లే అల్లర్లలో జనం చనిపోయారని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ దుమారం అప్పటి పార్లమెంటును సైతం కుదిపేసింది. ఎవ్వరూ నోరు మెదిపేందుకు కూడా సాహసం చేయలేని రోజుల్లో చంద్రబాబు ఎన్‌డిఎలో గట్టి పట్టుబట్టారు. పార్లమెంటులో గుజరాత్‌లో నరేంద్రమోడీని పదవినుండి తొలగించాలని ఎన్‌డిఎలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పట్టుబట్టారు.
ప్రస్తుతం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీకి అనివార్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు మిత్రపక్షమయ్యారు. మనసులో బాబుతో చెలిమి ఇష్టంలేనప్పటికీ పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు చెలిమి చేయాల్సి వచ్చింది. చెలిమి చేసి ఎన్నికల్లో లబ్దిపొందినప్పటికీ బాబు ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయడంలో సహాయ నిరాకరణ చేశారు. మోడీ పగతీర్చుకునే ప్రయత్నంలో తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు.
దీంతో నిన్నటి వరకు మిత్రధర్మం పాటిస్తున్నామని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఉన్నట్లుండి ఒక్కసారిగా సౌండ్ లేకుండా దెబ్బ కొట్టారు. బాబు కొట్టిన దెబ్బకు జాతీయ రాజకీయాల్లో కీలకమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మోడీకి వ్యతిరేకంగా 2002లో నోరెత్తిన చంద్రబాబే దేశంలో తిరుగులేదని చెప్పుకుంటూ ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీదే హవా అనుకుంటున్న సమయంలో బాబు కొట్టిన దెబ్బకు మోడీకి దిమ్మతిరిగినట్లైంది. మోడీ క్యాబినేట్‌లో రాజీనామాలతో ఎదుదెబ్బ కొట్టిన తొలినేత చంద్రబాబే అయ్యారు.
ప్రస్తుత పరిణామాలు చేస్తున్న సీనియర్లు స్పందిస్తున్నారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పటికీ చంద్రబాబు లెక్క చేయలేదు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీతో పెట్టుకోవడం సాహసమే’ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ, ముంబై యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ బాలచంద్ర ముంగేర్కర్ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. మాజీ ఎంపి శివశంకర్ టివి ఛానెళ్లతో మాట్లాడుతూ “ ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని ఇందిరాగాంధీకి చెప్పా. నా మాట వినలేదు.. ఏమైందో మీకు తెలుసు. సోనియా గాంధీకి చెప్పా విభజన చేయవద్దని కాని విన్లేదు.. కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో చూశారు. నేడు మోదీకి చెప్తున్నా.. చంద్రబాబుతో దూరమెందుకు, విభజన హామీలు నెరవేర్చరెందుకు? మాతో సఖ్యతగా ఉంటే మోదీకి కలిసొస్తుంది. లేకుంటే అంతే సంగతిలు..“ అంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో చంద్రబాబు అనుసరించిన ముక్కుసూటి వైఖరి మోడీ మరిచిపోయి ఉండరని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
2002లో లోక్‌సభలో 28 మంది సభ్యులతో వాజపేయి ప్రభుత్వంలో చంద్రబాబు కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. అదే సమయంలో గుజరాత్ అల్లర్లు జరిగాయి. శాంతి భద్రతల్ని పునరుద్ధరించడంలో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడమంటే మానవ విషాదాన్ని సొమ్ము చేసుకోవడమేనని అప్పట్లో టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. చంద్రబాబు గట్టిగా పట్టుపట్టడంతో మోదీని తప్పించేందుకు వాజపేయి ప్రయత్నించారు. కానీ… అద్వానీ లాంటి నేతలు అడ్డుకోవడంతో మోదీ పదవి పదిలమైంది.
చివరికి అప్పట్లో చంద్రబాబుకు నచ్చజెప్పేందుకు అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ స్వయంగా హైదరాబాద్ వచ్చారు. వాజపేయి కూడా టెలిఫోన్‌లో చంద్రబాబుతో అప్పట్లో మాట్లాడారు. గుజరాత్ అల్లర్లకూ, కారు కిందపడి చనిపోయిన కుక్కపిల్లకూ తేడా లేదనేలా మోదీ చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు… 2003లో మోదీ గణేశ్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ రావాలని చేసిన ప్రయత్నాలను కూడా అప్పుడు ఎపి సీఎంగా ఉన్న చంద్రబాబు గట్టిగా అడ్డుకున్నారు. అప్పటి నుంచే చంద్రబాబుపై మోదీ మదిలో రగిలిపోతున్నారట.
తప్పని స్థితిలో చెలిమి…?
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదని చెబుతారు. మోడీ వైసీపీతో వెళ్లాలనుకున్నప్పటికీ పార్టీలోని ఇతర నేతలు అందుకు నిరాకరించడంతో తప్పని పరిస్థితుల్లోనే టీడీపీతో మోడీ పొత్తుపెట్టుకున్నారు. తాను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ, మౌలిక సదుపాయాల రంగంలో చేపట్టిన అనేక విధానాలను గుజరాత్ సీఎంగా మోదీ అనుసరించారని మోదీ సమక్షంలోనే చంద్రబాబు చెప్పడం కూడా మోడీ అహాన్ని దెబ్బతీసినట్లు విశ్లేషిస్తున్నారు.
గుజరాత్ అల్లర్ల సమయం చంద్రబాబు తీరుపై ఉన్న మోడీ కోపాన్ని ప్రధాని అయ్యాక ‘పవర్’తో సాధించడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. సింగపూర్ వ్యవస్థాపకుడు లీ కువాన్‌యెవ్ కన్నుమూసినప్పుడు చంద్రబాబు అక్కడికి వెళ్లాలనుకున్నారు. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు. ప్రధానమంత్రితో వెళ్లే బృందంలోనూ చంద్రబాబు వెళ్లాల్సి ఉండగా అందుకు చోటివ్వలేదు. చంద్రబాబు తనతో సమానంగా సింగపూర్‌కు రావడానికి మోదీ అంగీకరించలేదట.
బాబుపై కోపం ప్రజలకు శాపం
చంద్రబాబుపై మోడీకున్న కోపం ఆంద్రప్రదేశ్ ప్రజలకు శాపమైంది. ప్రజాస్వామ్య బద్దంగా పన్నుల వాటాలో రావాల్సిన హక్కులు కూడా ఎపికి ఇవ్వలేదు. నిధులు ఇవ్వలేదు. ఇందుకు అనేక ఉదంతాలను నిదర్శనంగా చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను కనీసం పరిశీలించడానికి కూడా ప్రధానమంత్రి ఇష్టపడరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విదేశీ ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ద్వారానే రాష్ట్రానికి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు అబుదాబి యువరాజును ఆహ్వానించాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు మోదీ గండికొట్టారు.
పోలవరం విషయంలో కొర్రీలు పెట్టాలని స్వయంగా ప్రధాని కార్యాలయమే కోరిందని గతంలో కేంద్ర జలవనరుల మంత్రిగా ఉన్న ఉమాభారతి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘వ్యక్తిగతంగా నేను చంద్రబాబు అభిమానిని. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు’ అని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ర్టాలలో నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు విభజన చట్టంలో అవకాశం ఉంది. కానీ ‘వద్దు’ అని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే సీట్లపెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని అధికారులు పీట ముడి వేసినట్లు తెలుస్తోంది. ‘ఏపీ పట్ల నాకు సానుభూతి ఉంది’ అని జైట్లీ చెప్పడంలో నిజముందని, జైట్లీతోపాటు కేంద్ర మంత్రులంతా ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ వారి చేతులు కట్టేశారని ఢిల్లీ అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాబంటే భయమే….?
డిల్లీలో థర్డ్‌ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ఐకె గుజరాల్, హెచ్‌డి దేవెగౌడ ప్రధాన మంత్రులుగా ఉన్న కాలంలో చంద్రబాబు చక్రం తిప్పారు. జాతీయ రాజకీయాల్లో అనుభవం ఉన్న చంద్రబాబుకు నిధులు ఇచ్చి రాష్ట్రాభివృద్దికి సహకరిస్తే రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు అదుపులో ఉండేవి. అలా కాకుండా నిధులు ఇవ్వకుండా జనంలో ముద్దాయిలా చంద్రబాబును నిలబెడితే రాష్ట్రాజకీయాల్లో బిజీ అయిపోయి జాతీయ రాజకీయాల్లో తనజోలికి రాకుండా ఉంటాడన్న భయమైనా మోడీకి ఉండొచ్చని భావిస్తున్నారు. తాజాగా కెసిఆర్ తృతీయ ఫ్రంట్ ప్రకటనతో రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది.