ప్రకాశం జిల్లా (టంగుటూరు) : కుట్ర పూరితంగా వైజాగ్ ను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసిపి నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రకటనలో అన్నారు. అమరావతి రాజధానిగా ఉంటే జిల్లా ప్రజలు ఉదయం వెళ్లి పని పూర్తిచేసుకుని సాయంత్రానికి ఇంటికి రావచ్చని అలా కాకుండా వైజాగ్ రాజధాని ఐతే జిల్లా ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఆలోచించాలన్నారు. వైసిపి నాయకుల వ్యవహారం చూస్తుంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉందని అన్నారు. రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా వైసిపి నాయకులు జగన్ రెడ్డి ఫోటోలకు క్షీరాభిషేకం చేయడం జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. అసలు ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారో కూడా వారికి అర్ధం కాని పరిస్థితి అన్నారు. మన జిల్లా నుంచి 170 కి.మీ.దగ్గరలో ఉన్న రాజధానిని తీసుకుపోయి 550 కి. మీ.దూరంలో ఉన్న విశాఖపట్నానికి మార్చినందుకా, హైకోర్టు ను350కిమీ దూరంలో ఉన్న కర్నూలుకు తరలిస్తునందుకా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ప్రజలు భవిష్యత్తులో పడబోతున్న ఇక్కట్లును తలుచుకొని వైసిపి నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు కొంత మంది భూములు దోచుకునేందుకు వైజాగ్ లో రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మరి ఈ జిల్లా వైసీపీ నాయకులు కూడా అందులో భూములు కొన్నారా అందుకే సంబరాలు చేసుకుంటున్నారా ఏ విషయం జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగల్బాలు పలికే ఈ పెద్ద మనుషులకు మన జిల్లా ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు.హైకోర్టు రాజధాని జిల్లా ప్రజలకు అందనంత దూరం మార్చినందుకు పాలాభిషేకం చేశారా, మీకు ప్రజల సౌలభ్యాలు పట్టవా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన జిల్లాకు వచ్చిన కంపెనీలన్నీ వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వెనక్కి వెళ్లిపోయేలా చేశారన్నారు. దీనితో మన యువతకు ఉద్యోగాలు రాకుండా చేశారన్నారు. అందుకు సంబరాలు జరుపుకుంటున్నారా అన్నారు. గడిచిన 14 నెలల నుంచి మన రాష్ట్రం ఎంత వెనకబడిందో వైకాపా నాయకులకు తెలియదా? అని ప్టాశ్నించారు. అవన్నీ మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్నందుకు వైసిపి నాయకులు సిగ్గుపడాలన్నారు. వీరికి ఓట్ల లెక్కే గాని ప్రజల బాగోగులు పట్టవా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ప్రయోజనాల కోసం ఈ ప్రాంత వాసులుగా మీరు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని పోరాటం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.