Home ఆంధ్రప్రదేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న స్పీకర్ తమ్మినేని

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న స్పీకర్ తమ్మినేని

267
0

-సోమేశ్వరరావు విషయంలో స్పీకర్ వెంటనే క్లారిటీ ఇవ్వాలి
-కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
ప్రకాశం (దమ్ము) : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ చట్టాలు చేసే అధికారం ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవస్థలకు, సమాజానికి, శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడ్డగోలుగా అవినీతి చేస్తూ అక్రమాలకు పాల్పడడం అత్యంత హేయమని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఇసుక, మట్టి, క్వారీల అక్రమ తవ్వకాల్లో తమ్మినేని పేరు వినిపించడం అసెంబ్లీ, సెక్రటేరియేట్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసి వంచించడం వంటి ఆరోపణలు రావడం ఆయన కూర్చున్న స్థానాన్ని అవమానించడమేనని విమర్శించారు. స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తులు పార్టీలకు అతీతంగా, ప్రజా సేవే ధ్యేయంగా పని చేసిన చరిత్ర మన రాష్ట్ర శాసనసభకు ఉందని అన్నారు. నేడు స్పీకర్ గా ఉన్న తమ్మినేని తన అధికారాన్ని, పరపతిని అక్రమార్జనకు, అక్రమ వ్యాపారాలకు ఉపయోగించు కోవడం దుర్మార్గమన్నారు.

ఆముదాలవలస నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ వ్యాపారాలు, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడానికి స్పీకర్ తమ్మినేని కారణం కాదాని ప్రశ్నించారు. గతంలో ఏమీ లేని చోట ఏదో జరిగిందని ఆరోపణలు చేసిన తమ్మినేని సీతారాం నేడు తాను చేసిన అవినీతి ఆరోపణలన్నింటినీ నిరూపించేలా నాగావళి, వంశధారలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రావెల్ మాఫియాకు అధికారులను దాసోహం చేశారన్నారు.

సోమేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డులతో అసెంబ్లీ, సెక్రటేరియేట్, స్పీకర్ కార్యాలయాలలో ఇష్టానుసారంగా తిరుగుతూ స్పీకర్ తమ్మినేని అవినీతిని చట్టసభల్లోకి చేర్చారన్నారు. అనధికారిక వ్యక్తి, నకిలీ గుర్తింపు కార్డులతో తిరుగుతుంటే స్పీకర్ కార్యాలయం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ్మినేని అవినీతికి, దందాలకు ఈ సోమేశ్వరరావు అనే వ్యక్తి మధ్యవర్తిగా పని చేశారన్న ఆరోపణలపై స్పీకర్ ఎందుకు నోరు తెరవలేదని ప్రశ్నించారు. స్పీకర్ అధికారిక పర్యటనల్లో, అధికారిక కార్యక్రమాల్లో సోమేశ్వరరావు ఏ హోదాలో పాల్గొంటున్నాడో స్పీకర్ సమాధానం చెప్పాలని కోరారు. లేదా అతను తన బినామీ అని, తన అవినీతి, అక్రమాలను దగ్గరుండి చూసుకునే భాగస్వామి అని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు.

స్పీకర్ కు, ఆయన కార్యాలయానికి, సోమేశ్వరరావుకు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఏ విధంగా సర్టిఫై చేస్తారని అన్నారు. అసలు వారి మధ్య బంధంపై అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా స్పష్టత ఇస్తారని ప్రశ్నించారు. స్పీకర్, సోమేశ్వరరావు, బాలకృష్ణమాచార్యుల మధ్య ఏదో అవినీతి బంధం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. వీటిపై స్పీకర్ సమాధానం చెప్పాలని లేకుంటే న్యాయస్థానాలకు వెళ్లి సమాధానం రప్పించుకుంటామని అన్నారు.