Home ప్రకాశం టంగుటూరు ప్రజలకు నెలాఖరుకు రామతీర్థం నీళ్లు తెస్తాం : డోలా

టంగుటూరు ప్రజలకు నెలాఖరుకు రామతీర్థం నీళ్లు తెస్తాం : డోలా

797
0

టంగుటూరు : టంగుటూరుకి గత జన్మభూమిలో ఇస్తానన్న రామతీర్థం నీటిని ఈ నెలాఖరుకు తప్పనిసరిగా ఇస్తామని కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయానికి తాను రామతీర్ధం నీరు గ్రామప్రజలకు అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గ్రామాన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్లో చేర్చారని అన్నారు. దీని ద్వారా గ్రామం మరింత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందన్నారు. గతంలో పందులు, గుట్టలతో ఉన్న బుడబుక్కల కాలనీ, బుచ్చిరాజుపాలెం కాలనీతో సహా అన్ని రోడ్లు ఈరోజు సిమెంట్ రోడ్లు వేశామన్నారు. ఈ ప్రభుత్వంలో గ్రామాన్ని అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అగ్రవర్ణాల్లోని తెల్లకార్డున్న ఏ కులమైన రెండున్నర లక్షలతో ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తున్నామన్నారు.

గతంలో ఎస్సీలకు 2లక్షలు, ఎస్టీలకు రెండుంపాతిక లక్షలకు, ఓసిలకు ఒకటిన్నర లక్ష ఉంటే, ఇప్పుడు రెండున్నర లక్షల సబ్సిడీతో మూడున్నర లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తెల్లకార్డు ఉన్న గర్భవతికి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రైవేటు వైద్యశాలలో ఉచితంగా కాన్పు చేసే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి కల్పించారని చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రికి ఆడబిడ్డలు అందరూ అండగా ఉండాలని కోరారు.

వృద్ధులకు 1000రూపాయలు, వికలాంగులకు1500, 50 సంవత్సరాలు నిండిన కల్లుగీత కార్మికులకు1000 రూపాయలు, ఒంటరి మహిళలకు1000 రూపాయలు, హిజ్రాలకు1000 రూపాయలు, మాదిగ సోదరులైన, 50సంవత్సరాలు నిండిన డప్పు కళాకారులకు1500, 40సంవత్సరాలు నిండిన చర్మకారులకు1000 రూపాయలు ఇస్తున్నామన్నారు. వీరికి ఇస్తున్న పెన్షన్ ఇంకా ఎక్కువ పెంచడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచుతామని చెబితే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్లు పెంచడం అసాధ్యం, ఈ రాష్ట్రం 1600వందల కోట్ల లోటు బడ్జెట్లో అప్పుల్లో ఉంది కనుక 600 ఇస్తాం అని చెప్పాదన్నారు. ఈరోజు తాను పెన్షన్లు ఇస్తానని ఐదేళ్లలోనే అధికారం కోసం మాట మార్చిన వాళ్లను మీరు నమ్మొద్దని అన్నారు. జగన్ ఏవైతే అమలు కావని చెప్పారో వాటిని ప్రజలకు చెంతకు చేర్చి, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇచ్చిన గొప్పతనం మన ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముందు చెప్పిన విధంగా వీలైతే వచ్చే నెలలోనే పెన్షన్లు రెట్టింపు చేసి చూపుతామన్నారు.

ప్రతి ఒక్కరికి రుణాలు, రేషన్ కార్డులు, గ్యాస్ ఇస్తాన్నారు. ఈ విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొస్తున్నట్లు తెలిపారు. పేదరికంలేని సమాజం కోసం నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రికి అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం లబ్దిదారులకు రుణాలు, పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతో అలరించాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, టిడిపి యువ నాయకులు దామచర్ల సత్య, జెడ్పిటిసి పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎంపీడీవో సి హనుమంతరావు, తహసిల్దార్ రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఎం శైలజ, జన్మభూమి కమిటీ సభ్యులు కామని విజయ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు భారతి, పద్మ మండలంలోని అన్ని శాఖల అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.