అమరావతి : ఆన్‌లైన్‌లో మెడిసిన్ (ఔషదాలు) విక్రయించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలైన అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు పేదలు, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్న మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికితోడు ఆన్‌లైన్‌లో ఎలాంటి మందులు వస్తాయో, సమస్య వస్తే ఎవరిని అడగాలో కూడా తెలియని అగమ్యగోచర పరిస్థితి వినియోగదారులకు ఏర్పడుతుంది. ఇలాంటి విధానాలకు నిరసనగా మెడికల్ షాపుల యజమానుల అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఈనెల 28న మెడికల్ షాపులు బంద్ చేసేందుకు నిర్ణయించారు. 24గంటలపాటు దుకాణాలు మూసేసి ఉంటాయని యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈనెల 28అనగా శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బందవుతున్నందున రోజువారీగా వినియోగదారులు నిత్యం వాడే బిపి, షుగర్ వంటి జబ్బులకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరి ప్రయోజనం కోసం చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.