అమరావతి : ఆన్‌లైన్‌లో మెడిసిన్ (ఔషదాలు) విక్రయించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించడానికి నిరసనగా కలెక్టరేట్ ఎదుట నల్లబ్యడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ మెడికల్ షాపుల నిర్వాహకులు, డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడారు. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలైన అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు పేదలు, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్న మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికితోడు ఆన్‌లైన్‌లో ఎలాంటి మందులు వస్తాయో, సమస్య వస్తే ఎవరిని అడగాలో కూడా తెలియని అగమ్యగోచర పరిస్థితి వినియోగదారులకు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మెడికల్ విక్రయాలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండు చేశారు.
ఇలాంటి విధానాలకు నిరసనగా మెడికల్ షాపుల యజమానుల అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఈనెల 28న మెడికల్ షాపులు బంద్ చేసేందుకు నిర్ణయించారు. 24గంటలపాటు దుకాణాలు మూసేసి ఉంటాయని యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈనెల 28అనగా శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బందవుతున్నందున రోజువారీగా వినియోగదారులు నిత్యం వాడే బిపి, షుగర్ వంటి జబ్బులకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరి ప్రయోజనం కోసం చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.