మాస్ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుడు రవితేజ. గత ఏడాది ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలతో పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్… ఈ సంవత్సరాన్ని మాత్రం ‘జీరో రిలీజ్ ఇయర్’గా సరిపెట్టాడు. అయితే, 2020లో మాత్రం తక్కువ గ్యాప్‌లోనే రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు రవితేజ. ఆ చిత్రాలే… ‘డిస్కో రాజా’, ‘క్రాక్’.
‘డిస్కో రాజా’, ‘క్రాక్’… ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ లోనే రూపొందుతున్నాయి. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’లో రవితేజ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడు. అంతేకాదు… ఇందులో ‘కోమా కామెడీ’తో మాస్ మహారాజా నవ్వులు పండిస్తాడట. కొన్నాళ్ళు పాటు కోమాలో ఉండి బయటకొచ్చే ఈ పాత్రలో రవితేజ… సరికొత్తగా మురిపిస్తాడని టాక్. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనవరి 24న తెరపైకి రానుంది. ఇక ‘క్రాక్’ విషయానికి వస్తే… ఇదో కాప్ స్టోరీగా రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫర్గా దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటివరకు రవితేజ నటించిన పోలీస్ కథల్లో సింహభాగం విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… వేసవికి రానున్న ‘క్రాక్’ కూడా అదే బాట పడుతుందని యూనిట్ అభిప్రాయపడుతోంది. మరి ‘రాజా ది గ్రేట్’ తరువాత సరైన విజయం లేని రవితేజని… ఈ రెండు సినిమాలైనా సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువస్తాయేమో చూడాలి.