మర్రిపూడి : పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రకాశం ఎస్పీ సిద్దార్థ కౌశల్ అన్నారు. మర్రిపూడిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక సంకల్పంతో అందరి సహాయ సహకారాలతో మంచి మనస్సుతో చేస్తున్న ఈ కార్యక్రమం అభినందించదగ్గ విషయం అన్నారు. చిన్నవారుకూడా రెండు ఇటుకలు తెచ్చిపెట్టినా ఇది నాది అనే మానసికమైన తృప్తి ఉంటుందన్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ ప్రకాశరావు, పొదిలి సిఐ వి శ్రీరామ్, మర్రిపూడి, పొదిలి, దొనకొండ, కెకె మిట్ల ఎస్సైలు సుబ్బరాజు, సురేష్, ఫణిభూషన్, వెంకటేశన్ నాయక్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ దాతలు, మండలంలోని పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.