టంగుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇద్దరు మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణమాదిగ అన్నారు. ఫిబ్రవరి 19న అమరావతిలో జరిగే మాదిగల మరో విశ్వరూప మహసభ జయప్రదం చేయాలని కోరారు. అందులో భాగంగా కొండేపి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగిన మాదిగల విశ్వరూప సమాయత్త మహాసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్, ఇతర పార్టీల నాయకులు రెండు రాష్ట్రాల్లో రెండు నాలుకల మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కన్నా ఆంధ్రాలో మాదిగలు ఎక్కువమంది ఉన్నా, ఏపీలో మాదిగలే లేరని మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్లో అందరూ మాలలనే నియమించడం దారుణమన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా మాదిగలను ఎదగకుండా మోసం చేస్తున్నారన్నారు. అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను తాను స్వాగతిస్తూ, సమర్థిస్తున్నట్లు తెలిపారు.
కానీ దేశంలో అగ్రకులాలు ఎంతమంది ఉన్నారో తేల్చారా? అగ్రకులంలోని పేదలు ఎంతమంది, ధనికులు ఎంతమంది ఉన్నారో రికార్డు ఉందా? దానిమీద దేశవ్యాప్తంగా సర్వే జరిగిందా? కమిషన్ రిపోర్టు ఏమన్నా ఉన్నాయా? బిజేపి ఎప్పుడైనా పది శాతం ఇవ్వాలని చర్చ పెట్టిందా? వాళ్ల మేనిఫెస్టోలో పెట్టిందా? క్యాబినెట్ కి తీసుకు వచ్చే నాటికి, మంత్రులకన్నా తెలుసా? ఎవరికి తెల్వకపోయినా మోడీ క్యాబినెట్ ఆమోదం తెలుపుకొని, లోక్ సభ,రాజ్యసభతో పాటు రాష్ట్రపతి చేత ఆమోదం తెలుపు కొని, ఇప్పుడు అమలు జరిగేలా చేస్తున్నారన్నారు. ఈ విషయంలో సర్వే, నివేదికలు ఏమీ లేకున్నా వాళ్లు చేయదలచుకున్నది చేస్తున్నప్పుడు, మొదటి నుండి ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్న బిజెపి నాయకులు 25ఏళ్లుగా తాము చేస్తున్న ఎస్సి వర్గీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం చూస్తే మాదిగల పట్ల ఎంత చిన్నచూపు, లెక్కలేని తనం, నిర్లక్ష్యమో అర్థమవుతుందన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి శ్యామ్ మాదిగ అధ్యక్షత వహించిన సభలో రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్హ్మయ్య మాదిగ, ఆలూరి చిరంజీవి, దేవరపల్లి భిక్షాలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మాదిగలు పాల్గొన్నారు.