ప్రకాశం (దమ్ము) : దళిత సాహిత్యంలో బలమైన సాహిత్యాన్ని ఆవిష్కరించిన కవి మహేందర్ అని ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు గంగవరపు సునీత అన్నారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో దర్శి బీసీ వసతి గృహంలో ఆదివారం తెలంగాణ కవి మహేందర్ కట్కూరి రచించిన సురికత్తి పుస్తకావిష్కరణ చేశారు.
ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు గంగవరపు సునీత సురికత్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, వెనుకబడిన జీవితాల్లోని అనేక కోణాలను మహేందర్ సురికత్తి కవితా సంకలనంలో స్పృశించారన్నారు. మహేందర్ అనుభవ పూర్వకంగా తన చుట్టుపక్కల జీవితాలను తన కవిత్వంలో ఆవిష్కరించారని చెప్పారు. తన జాతి చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం నేటి దళిత కవుల ముందున్న కర్తవ్యం అన్నారు.
ఎవరి చరిత్ర వారే రాసుకోవాలనే సత్యాన్ని గుర్తించిన మహేందర్ సురికత్తి వంటి పదునైన కవిత్వాన్ని అందించారని చెప్పారు. ఇదే వరవడితో మరిన్ని పుస్తకాలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శరత్ బాబు, ఉమామహేశ్వరరావు, శేషయ్య, అంకయ్య, పొదిలి కుమార్, గాంధీ, జాన్, ప్రసన్న పాల్గొన్నారు.