అద్దంకి : సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. గత ఆరు రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మహా కలశ పాదయాత్ర మహిళా భక్తులు ప్రారంభించారు. గుండ్లకమ్మ నది నుండి 7 కిలోమీటర్లపైగా మహిళా భక్తులు కాలినడకన సింగరకొండకు చేరుకున్నారు. కళశ శోభాయాత్రకు మహిళా భక్తులు వేకువ జామునే గుండ్లకమ్మకు చేరుకున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉదయం 8గంటల నుండి శృంగేరి పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక కుంబాభిషేకం జరిపారు. దేవస్థానం రాతి ముఖ మండప నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల నుండి ముఖ మండప నిర్మాణం జరిగిందని, అంచెలంచెలుగా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సింగరకొండకు మరింత పేరు తెచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని ఆయన అన్నారు. శ్రవణా నక్షత్ర యుక్త మిధున లగ్నమున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నూతన విమాన శిఖర జీవద్వజ ప్రతిష్టా మహాకుంభాభిషేక మహోత్సవాలు దాతలు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డివిబి స్వామి, శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్, ఇంటూరి నాగేశ్వరరావు, ఇఒ మదమంచి తిమ్మనాయుడు, దాతలు మేదరమెట్ల శంకరారెడ్డి పాల్గొన్నారు.
పోలీస్ బందోబస్తు
వర్షపు చిరుజల్లులు పడుతున్నప్పటికీ భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా దాతలు క్యూ లైన్లో మజ్జిగ, తాగునీరు మహిళా వాలంటీర్లు అందిస్తూనే ఉన్నారు. గంటలు తరబడి క్యూ లైన్లోనే కొనసాగి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహా కుంభాభిషేకం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రత్యేకంగా కేరళ, ఇతర ప్రాంతాల నుండి డప్పు వాయిద్యాలు, కోయ సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతనో అలరించాయి.
భక్తులకు అన్నదానం
మహా కుంభాభిషేకం సందర్భంగా గత ఆరు రోజుల నుండి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానాలు ఏర్పాటు చేశారు. చివరి రోజు లక్షల మంది భక్తులు రావడంతో దేవస్థానం ఆధ్వర్యంలో, వివిధ సామాజిక అన్నదాన సత్రాల్లో అన్నదానం ఘనంగా నిర్వహించారు.
చిరుజల్లులతో స్వాగతం
మహాకుంభాభిషేకానికి కొద్ది గంటల ముందే చిరుజల్లులు స్వాగతం పలకగా గుండ్లకమ్మ నది నుండి మహిళా భక్తులు కలశ పాదయాత్ర సింగరకొండవైపు కొనసాగింది. చిరుజల్లుల్లోనే తడుస్తూ దేవస్థానం వరకు మహిళలు చేరుకున్నారు. నదీ జలాలను ప్రత్యేకంగా ఉంచి స్వామివారికి అభిషేకం చేశారు.