– ఎన్నేళ్లయినా మరువలేనిది మీ రాజసం
– ఎన్నేళ్లయినా చేరిగిపోని జ్ఞాపకం
ఒంగోలు : మరణించిన తరువాత కూడా జీవించడమంటే.. ఒక మనిషి విలువ జీవించిన సమయంలోనే కాదు. మరణించిన తర్వాత కూడా మనిషిగా సజీవంగా సమాజాన్ని ప్రభావిత చేస్తాడు. భవిష్యత్తుకు తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. అలా 25ఏళ్లు గడిచినా భవిష్యత్ తరానికి ఆదర్శవంతంగా ప్రజల హృదయాలలో జీవించి ఉన్న, మూర్తీభవించిన మహోన్నత రాజకీయ దురంధరుడు, నిస్వార్ధ ప్రజా సేవకుడు మాజీ లోక్ సభ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి.
1947 నవంబర్ 26న నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం పేడూరుకు చెందిన మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ మొదటి సంతానంగా సుబ్బరామరెడ్డి జన్మించారు.
సుబ్బరామరెడ్డికి సుధాకర్ రెడ్డి, సుహాసనమ్మ,
శ్రీనివాసులరెడ్డి అనే తమ్ముళ్లు, చెల్లెలు వున్నారు.
వారూ వ్యాపారరంగంలో, శ్రీనివాసులరెడ్డి రాజకీయ రంగంలో ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు సుబ్బరామరెడ్డి చదువులో ప్రధమ స్థానంలో వుండేవారు.
పేడూరు ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. నెల్లూరు వెంకటగిరి రాజా హైస్కూల్, కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశారు. 1963లో కర్ణాటక తుంకూరులో ఇంజనీరింగ్ లో చేరారు. ఇంజనీరింగ్ చదువుతుండగా 1965లో తన తండ్రి హఠాన్మరణంతో చదువు మధ్యలోనే వదిలివేసి కుటుంబ నిర్వాహణ భాద్యతలతో పాటు తండ్రి చేస్తున్న వ్యాపార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి కుమార్తె పార్వతమ్మను 1967 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నారు. వీరికి విజయ్ రెడ్డి, మాలిని ఇద్దరు సంతానం. కోడలు మమత, మనుమడు జూనియర్ సుబ్బరామరెడ్డి, అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డి, మనుమడు అనీష్ ఉన్నారు. సుబ్బరామరెడ్డి కృషి పట్టుదలతో ఒకపక్క పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ.. మరోప్రక్క మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనతికాలంలోనే నెల్లూరు జిల్లాలో చురుకైన నేతగా ఎదిగారు. సేవాకార్యక్రమాలతో ప్రముఖ వ్యక్తిగా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సుబ్బరామరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, నటరత్న స్వర్గీయ ఎన్టీ రామారావు వీరాభిమాని. ఆ అభిమానంతో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా తన 32సంవత్సరాల చిన్న వయస్సులొనే ఒకే ఒక సినిమా ధియేటర్ కి సరిపడే స్థలంలో తన ఇంజినీరింగ్ ప్రతిభతో రాఘవ సినీ కాంప్లెక్స్ పేరుతో వినూత్నమైన ఆలోచనతో నెల్లూరులో తను నిర్మించిన కృష్ణ, కావేరి, కల్యాణి అనే అద్భుతమైన మూడు సినిమా థియేటర్ల కాంప్లెక్స్ సముదాయాన్ని ఎన్టీ రామారావుచే ప్రారంభింపజేశారు. నెల్లూరులో తన 14వ యేట తండ్రిచే కొనుగోలు చేయబడిన లీలామహల్ మాత్రమే కాకుండా, నెల్లూరు, మద్రాసులలో సత్యం, శివం, సుందరం అనే మూడు సినిమా థియేటర్లతో పాటు మరెన్నో సినిమా థియేటర్లు కొని సినిమా వ్యాపారాన్ని సాగించారు.
స్వయం కృషి, కష్టించి పనిచేయడం వంటి లక్షణాలతో అతి చిన్న వ్యాపారస్తుని స్థాయి నుండి 20ఏళ్లలో దేశంలోనే అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. వ్యాపారాల్లో తలమునకలవుతూ కూడా కుటుంబాన్ని ఒక స్థాయికి తెచ్చి మాగుంట కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.
సుబ్బరామరెడ్డి స్వతహాగా మృదుస్వభావి. ఆయనతో సంభాషిస్తున్నప్పుడు మరికొంత సేపు మాట్లాడితే బాగుండుననిపిస్తుంది. అద్భుత జ్ఞాపకశక్తి కలవారు. అందువల్ల ప్రతిమనిషి ఆయనను తమ సొంతం చేసుకున్నారు. అదే అభిమానంతో తన ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతివ్యక్తీ తనతోపాటు తన ఇంటిలో భోజనం చేయాల్సిందే. ఆ పద్దతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం ప్రజలపై “మాగుంట” కుటుంబానికి ఉన్న అభిమానానికి నిదర్శనం. ఆయన సేవ, ఆపన్నహస్తంతో ప్రజల్ని తన సొంతం చేసుకున్నారు. ప్రేమ, అభిమానాలతో కుటుంబ సభ్యుల హృదయాలను పొందగలిగారు. ఆయన జీవితంలో రాజకీయం ఒక ప్రముఖ అధ్యాయం. ఆయనలోని దాతృత్వం, దక్షత, నిజాయతీలను రాజకీయ రంగం ఆకర్షించింది. నాయకుల దృష్టిలో కొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రోత్సాహంతో మాజీ ప్రధాని రాజీవగాంధీ కోరిక మేరకు రాజకీయాలలోకి వచ్చారు. 1991 ఏప్రిల్ 26న అప్పటికి యెలాంటి పూర్వపరిచయాలు లేని ఒంగోలు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలులో నామినేషన్ వేయడానికి నెల్లూరు నుండి కిలోమీటర్ల పొడవు వందలాది వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరి రావడం అప్పట్లో అదొక సంచలనంగా నిలిచిపోయింది. అప్పట్లో ఎన్టి రామారావు రాజకీయ ప్రభంజనం వీస్తున్న సమయం. అయినా తను నమ్మిన కృషి, పట్టుదలతో నామినేషన్ వేసిందే మొదలు ఊరూ, వాడా, ప్రతి పల్లె ఎండనక వాననక రాత్రింబవళ్ళు పార్లమెంట్ నియోజకవర్గమంతా తిరిగి తన చిరునవ్వు, ఆప్యాయతతో భరోసా కలిగించే ఉపన్యాసాలతో ప్రజల మనసులను దోచుకున్నారు. ఆ ఎన్నికల్లో సుబ్బరామరెడ్డి గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో విజయకేతనం ఆవిష్కరించారు. పార్లమెంటు సభ్యులంటే ఏ ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో ఉంటూ ప్రజలకు దూరంగా ఉంటారని అప్పటిదాకా ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు. ఎన్నికైన వెంటనే ఒంగోలులో నివాసమేర్పరచుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్లమెంటులో తన 44వ ఏట అడుగుపెట్టి, కొద్ది కాలంలోనే దేశ ఆర్థిక పరిస్థితి, సంస్కరణలపై పార్లమెంట్ లో తాను చేసిన ప్రసంగం దేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ ఆకట్టుకుంది. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసలందుకున్నారు. ఆయన మేధస్సు, రాజకీయ పరిజ్ఞానం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలలో పార్లమెంట్ మెంబర్ల సలహా సంప్రదింపుల కమిటీలో మెంబెర్ గా నియమింపబడ్డారు. స్వల్ప కాలంలోనే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ లో ఉత్తమ నేతగా గుర్తింపు పొందారు. అదే నమ్మకంతో 1992లో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అప్పజెప్పిన తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలను నభూతో నభవిష్యత్ అన్నట్లు కాంగ్రెస్ హేమాహేమీలను సైతం ఆశ్చర్యచకితులను చేశారు. ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ఆదరాభిమానాలు, పార్టీకోసం నిరంతర కృషితో అప్పటి ఏఐసిసి జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడుగా దగ్గరై అనతికాలంలోనే కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా మారారు. ఆయన ఒకప్రక్క రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే మరోప్రక్క నెల్లూరులోని రంగనాథ స్వామి ఆలయానికి ట్రస్టీగా వుంటూ, బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సంస్థను స్థాపించారు. విశాఖ, తమిళనాడు, గుమ్మడిపూడిలలో స్టీలు ఫ్యాక్టరీలు స్థాపించారు. ఆక్వా పరిశ్రమను నెలకొల్పి స్వంతంగా ట్రాన్స్ పోర్టు నౌకల ద్వారా షిప్పింగ్ వ్యాపారంలో అడుగుపెట్టారు. యుబి గ్రూపు సహకారంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలలో లిక్కర్ వ్యాపారంలో భాగంగా డిస్టిలరీ ఫ్యాక్టరీలు నిర్మించారు. చెన్నైలో స్టార్ హోటళ్ల నిర్మాణం. కల్యాణి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు ద్వారా సినిమా నిర్మాణంతో పాటు సినిమా థియేటర్ల నిర్మాణం చేపట్టారు. మద్రాసులోని కళాసాగర్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా, ఉదయం, ఆంధ్ర పత్రిక దినపత్రికల అధిపతిగా ఉంటూనే ‘ది గార్డియన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ బిజినెస్’అనే ఇంగ్లీషు పత్రికను స్థాపించారు.
వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చిన అపరభగీరధుడు. ప్రాథమిక విద్యతోనే గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు కాలేజీ విద్య చేరువ చేయాలనే విద్యాభిమానంతో గ్రామీణ ప్రాంతాలలో ఎంఎస్ఆర్ పేరుతో జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యాదాతగా నిలిచారు. సింగరాయకొండ లో పినాకినీ ఎక్స్ ప్రెస్ నిలుపుదలతో పాటు, ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా కొండేపి, కందుకూరు నియోజకవర్గాల లోని వందలాది మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించి మహిళా పక్షపాతిగా నిలిచారు. ఇవేకాక దళిత కాలనీలకు అంబేద్కర్ విగ్రహాలను, ఎన్నో సంఘాలకు విరాళాలు అందజేసారు. అలాగే 1995లో ఆయన ప్రస్థానంలో చివరిగా పుట్టపర్తి సాయిబాబా జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురం కరువు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీరు సరఫరా కోసం సాయిబాబా ట్రస్ట్ కి కోటి విరాళం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరిన్ని నిధులను కేటాయింపజేసి అవి అమలయ్యేదాకా విశ్రమించేవారు కాదు. ఒంగోలు పట్టణంలో సిమెంటు రోడ్లతో పాటు ఒంగోలు, మద్రాసు జాతీయ రహదారి, ఒంగోలు, నంద్యాల, కందుకూరు, కనిగిరి, పామూరు వగైరా పట్టణాలలో సిమెంటు రోడ్లు తన ప్రత్యేక కృషితో చేయించగలిగారు. ఇవేకాక బలహీనవర్గాలకు సామాజిక భవనాలు, కళ్యాణ మండపం నిర్మాణాలు, దేవాలయాలు, చర్చ్ లు, మసీదుల ఏర్పాటు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ‘కుడిచేయి చేసేవి ఎడమ చేతికి తెలియకుండా’ జాతి, కుల, మత తేడాలులేకుండా లెక్కకు మించిన దానధర్మాలు చేశారు. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా వుంటూ దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతున్న తరుణంలో 1995డిసెంబర్ 1న ఒంగోలులోని తన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్న సమయంలో నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందారు. ఒక నక్షత్రం దివి నుండి భువికి రాలింది. ఒక అమృత కలశం భువి నుండి దివికి చేరింది. ఆయన కన్నుమూసినా చరిత్రలో చిరంజీవిగా నిలిచారు. ఆ తర్వాత ఆయన సతీమణి పార్వతమ్మ 1996లో ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలిగా అనంతరం కావలి నియోజకవర్గ శాసనసభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత సుబ్బరామరెడ్డి సోదరులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ తరపున ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా 1998, 2004, 2009లో గెలుపొందారు. తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీగా పనిచేశారు. అనంతరం వైస్సార్ సిపీ తరపున 2019లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల చరిత్రలోనే 2 లక్షల పైచిలుకు అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయభావుటా ఎగురవేశారు.
రాజకీయాలకు అతీతంగా సుబ్బరామరెడ్డి ఆశయ సాధనకోసం అలుపెరుగని నేతగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన వదినగారైన పార్వతమ్మ, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో తన అన్నయ్య సుబ్బరామరెడ్డి కొనసాగించిన సేవాకార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ‘మాగుంట’ ఇంటిపేరునే మానవత్వానికి చిరునామాగా, సమాజ సేవే వారసత్వంగా మలిచారు. పెద’నాన్న’, పెద్దమ్మ, తండ్రి చూపిన ప్రజాహితమే పరమావధిగా శ్రీనివాసులరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి యువ పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో రానిస్తూ ప్రజాహిత కార్యక్రమాలతో పిన్నవయస్సులోనే పెద్దల బాటలో పయనిస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో జిల్లా వైద్యశాలలో, చీరాల వైద్యశాలలో రక్త నిల్వలు సరిపోయినంత లేనందున కరోనా, ఇతర రోగుల బాధలు, రక్త అవసరాలను గ్రహించి జిల్లాలో మరిన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎందరో రోగులకు రక్తనిల్వలు అందుబాటులో ఉంచి, ఎందరికో ప్రాణదానం చేసిన మానవతావాదిగా నిలుస్తున్నారు. అలాగే రాఘవరెడ్డి తన జన్మదినాన్ని సేవాకార్యక్రమాల దినంగా ప్రకటించి జిల్లాలోని ప్రజలతో పార్టీలకతీతంగా సేవాకార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడాన్ని చూసిన ప్రజలు పెద’నాన్న’ మాగుంట సుబ్బరామరెడ్డిని గుర్తుచేసుకున్నారు. పెద’నాన్న’ ఆశయాల కోసం వారుచేసిన, చేస్తున్న సేవాకార్యక్రమాలకు నిగర్విగా పునరంకితుడై పనిచేయడం గొప్ప విషయమని, తండ్రికి తగ్గ తనయుడిగా మాగుంట రాఘవరెడ్డి పేదల పెన్నిధిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని ఆయన చేస్తున్న ప్రజాహిత సేవాకార్యక్రమాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.