ముందే పెళ్లైంది… ఆపై ప్రేమ… పెద్దలు అంగీకరించరనే భయం…. చివరికి ఏమైందో చూడండి

    315
    0

    తాడేపల్లి : “నీకు ముందే పెళ్లయింది కదా..? మళ్లీ పెళ్లేంటి..? సరే ఇంటికి వచ్చేయ్‌. మాట్లాడుకుందాం.” అంటూ తండ్రి చెప్పిన మాటలు ఆ యువకునికి ఏమనిపించాయో తెలియదు. ఆతర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఎక్కడున్నాడో తల్లిదండ్రులకు సమాచారం లేదు. తాను పనిచేసే దుకాణ యజమాని కూతురితో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించరనే భయంతో ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డారు. యువకుడు మృతి చెందగా యువతి మృత్యువుతో పోరాటం చేస్తుంది.

    తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహాలయాల సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో పురుగు మందు కలుపుకొని తాగగా, యువకుడు మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హుటాహుటిన పోలీసులు వైద్యశాలకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమాక – ఉండవల్లి గ్రామ సరిహద్దు కొండ వద్ద ఓ యువజంట అపస్మారక స్థితిలో పడివుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొనఊపిరితో ఉన్న యువతిని వైద్యశాలకు తరలించారు.

    యువకుడు మృతి చెందాడు. అతని వద్ద ఆధార్‌, ఓటరు ఐడీ కార్డులు లభించాయి. ఆధార్‌ కార్డును పరిశీలించారు. యువకుని పేరు వెండిదండి పృథ్వీ (25), సన్నాఫ్‌ గోపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లా ముప్పాలపాడు చిరునామా కనిపించింది. అయితే అతని వద్ద ఉన్న ఓటరు కార్డులో మాత్రం గంగానమ్మపేట, నాళంవారివీధి, తెనాలి అడ్రస్‌ ఉంది. మృతుడు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ముప్పాలపాడు గ్రామస్తుడని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఫ్రూట్‌ జ్యూస్‌ స్టాల్‌లో పని చేస్తున్నాడని, వివాహితుడని పోలీసులు తెలిపారు. ఫ్రూట్‌ జ్యూస్‌ స్టాల్‌ యజమాని కుమార్తె హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌కు చెందిన ఫర్హానాను ఈ నెల 1న బయటకు తీసుకువచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరూ కనిపించకపోవడంతో యువతీ యువకుల కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాలలో గాలిస్తున్నట్టు తెలిపారు.

    మంగళవారం పృథ్వీ తన తండ్రికి ఫోన్‌ చేసి, ఫర్హానాను పెళ్లి చేసుకున్నాని చెప్పాడు. ఇప్పటికే పెళ్లైందని, మరలా పెళ్లి ఏంటని, మాట్లాడుకుందాం రమ్మని చెప్పగా పృథ్వీ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. పెద్దలకు ఇష్టం లేదని, మనస్తాపం చెంది, ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని సీఐ సుబ్రహ్మణ్యం చెప్పారు. యువతి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. ఇరువురి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. కాగా యువకుడి మృతదేహాన్ని తరిలించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ వినోద్‌లు కర్రల సాయంతో కొండ ప్రాంతం నుంచి కిందకు తీసుకువచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.