హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ చర్చలు సఫలం కావడంతో లారీ యజమానులు సమ్మె విరమించారు. చర్చల అనంతరం సమ్మె విరమించామని ఏపీ లారీఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌రావు తెలిపారు. తమ సమస్యల కోసం దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు.
సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల లారీలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డిజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించాలని యజమానులు డిమాండ్ చేశారు. లారీలు నిలిచిపోవడంతో సరుకుల రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం దిగిరాకుంటే నిత్యావసర సరుకుల రవాణాను నిలిపివేస్తామని యజమానులు హెచ్చరించారు. దీనితో ప్రభుత్వం చర్చలు జరిపింది.