Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత విఆర్ఏ కరోనా మృతిపై జుడిషియల్ న్యాయ విచారణ జరిపించాలి : కులవివక్ష...

ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత విఆర్ఏ కరోనా మృతిపై జుడిషియల్ న్యాయ విచారణ జరిపించాలి : కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి

451
0

ప్రకాశం : కరోనా చికిత్సకు వెళ్లి రోడ్డు ప్రక్కన అనాధ శవంలా మారిన దళితుడైన విఆర్ఏ కాంతారావు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న వైనంపై జుడిషియల్ న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కలెక్టర్ పోలా భాస్కర్ కు లేఖ ద్వారా కోరారు.

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంటకు చెందిన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (విఆర్ఏ) ఇత్తడి కాంతారావు(56) తన విధుల్లో నిమగ్నమై ఉండగా అతనికి జ్వరం వస్తూ పోతూ ఉండడంతో ఈ నెల 5న తన స్వగ్రామంలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షలలో అక్కడి వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ గా నిర్దారణ చేసి అదే రోజు రాత్రి 8.30లకు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తీసుకువెళ్లారు. మరుసటి రోజైన 6న ఉదయం 10 గంటలకు కాంతారావు తన కుమారుడికి ఫోన్ చేసి తనకు బెడ్ ఇచ్చారు కానీ అన్నం పెట్టలేదని చెప్పిన వెంటనే ఫోన్ స్విచాఫ్ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తర్వాత రిమ్స్ కు వెళ్లి కాంతారావు ఆచూకీ గురించి ఒంగోలు రిమ్స్ లో, గ్రామంలోని సిబ్బందిని విచారించారు. ఎవ్వరిని అడిగినా కాంతారావు గురించిన సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఒక దినపత్రికలో ‘జిజిహెచ్ లో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు’అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో రిమ్స్ సిబ్బంది మృతదేహాన్ని మార్చురీలో పెట్టినట్లు ఉండటాన్ని చుసిన బంధువులు ఒంగోలు రిమ్స్ మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని చూసి కాంతారావుగా గుర్తించారు. కాంతారావును రిమ్స్ లో చేర్చిన విషయం వాస్తవమని బంధువులు తెలిపారు. ఐతే రిమ్స్ సూపరింటెండెంట్ మాత్రం రిమ్స్ లో కాంతారావు చేరలేదని, రికార్డులలో కూడా అతని సమాచారం లేదని రిమ్స్ సిబ్బంది తెలపడంతో కొండపి శాసనసభ్యులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గుర్తించిన ఎమ్యెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వెంటనే కలెక్టర్ పోలా భాస్కర్ కు ఫోన్లో విషయాన్ని వివరించారు. కలెక్టర్ సూచన మేరకు ఆర్డీఓ రిమ్స్ వద్దకు వచ్చి రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం విచారణ అనంతరం చెప్పగలమని ఆర్డీఓ తెలిపినట్లు మృతుని బంధువులు తెలిపారని మాల్యాద్రి అన్నారు.

దళితుడైన విఆర్ఏ కాంతారావు మృతిపై జుడిషియల్ న్యాయ విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ పోలా భాస్కర్ ను కోరారు.