చీరాల : రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కెవిపిఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలో ఎరిచర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు కేవలం మాస్కు పెట్టుకో లేదన్న కారణంతో పోలీసులు కొట్టడం వల్లనే యువకుడు మృతి చెందాడని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. యువకుడు మృతికి కారణమైన పోలీసు అధికారులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, దళిత సంఘాల నాయకులు గోసాల ఆశీర్వాదం, గోసాల సుధాకర్, బెజ్జం విజయ్ కుమార్, మోహన్ కుమార్ ధర్మ, షేక్ అబ్దుల్ రహీం, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, గూడూరు శివరాం ప్రసాద్, బి సుబ్బారావు, కె రామారావు, మెరుగ రవిచంద్ర, పి ఆనంద్, అయినంపూడి అనిల్, ఇసాకు పాల్గొన్నారు.