టంగుటూరు : కుమ్మరిగుంట అన్యాక్రాంతాన్ని చూస్తూ ఊరుకోమని, అడ్డుకుంటామని వైస్సార్ సీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ అన్నారు. ప్రభుత్వం ఇండ్లస్థలాల కోసం సేకరించిన పొలాల్లో గతవారం రోజులుగా స్థానిక అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ లకు సమీపంలోని కుమ్మరికుంటలో మట్టిని ఉపాధి హామీ నిధులతో జెసిబి ప్రొక్లెయిన్ తో ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, వైస్సార్ సీపీలో ఒకవర్గం నాయకులు, తన అనుయాయులతో దగ్గరుండి తోలుతున్నారని ఆరోపించారు. కుమ్మరికుంట నుండి మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, ట్రిప్పర్లను అడ్డుకుని మట్టి తొలకాన్ని ఆపారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు బి అరుణ చరవాణిలో అడ్డుకోవడానికి గల కారణాలను వివరించారు. అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ లకు దగ్గరలో ఉన్న ఈ కుమ్మరికుంటలో ప్రొక్లెయిన్ లతో మట్టి తోలడం వలన దగ్గరలో ఉన్న పల్లెలకు నీటి ఇబ్బందులు వుంటాయని చెప్పారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో ఎంతో లోతుకు త్రవ్వి మట్టిని తరలించారని అన్నారు. మళ్లీ ఇప్పుడు మరింత లోతుకు త్రవ్వితే పేద ప్రజలు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు కూడా ప్రమాదమేనని అన్నారు. మట్టిని తోలుతున్న వాహనాల వల్ల పల్లెల్లో రోడ్లు ధ్వంసం అవ్వడమే కాకుండా దుమ్ముతో కాలుష్యం ఆవరిస్తుందని అన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియపరిచామని చెప్పారు. వారి నుండి చర్య లేక పోవడంతో వాహనాలను అడ్డుకోవడం జరిగిందని అన్నారు. కుమ్మరికుంటలోని మట్టిని కుంట చుట్టూతా కట్టవెయ్యాలే గాని, బయటకి తరలిస్తే అడ్డుకుంటామన్నారు.
ఈ విషయమై మాజీ సర్పంచ్, వైసీపీలో ఒక వర్గం నాయకులు పుట్టా వెంకట్రావుతో చరవాణిలో మాట్లాడగా కుమ్మరికుంటలో మట్టిని తోలుతున్న వాహనాలను అడ్డుకున్న విషయం తనకు తెలియదన్నారు. ఏమన్నా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఐతే కుమ్మరికుంటలో మట్టిని తోలుతున్న వాహనాలను తన అనుచరులతో కలిసి అడ్డుకున్న వైసీపీ నాయకురాలు బొడ్డపాటి అరుణ గత వారంలో టంగుటూరులోని కొందరి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. పిడిసిసి బ్యాంక్ చైర్మన్, వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య ఆమె ఇంటికి వెళ్లి నిరాహారదీక్ష నిర్ణయాన్ని విరమించుకునేలా చేయడం అందరికీ తెలిసిన విషయమే.