Home జాతీయం టీ అమ్మితే అంత సంపాదించొచ్చా : బిజెపిపై కుమార‌స్వామి ఆగ్ర‌హం

టీ అమ్మితే అంత సంపాదించొచ్చా : బిజెపిపై కుమార‌స్వామి ఆగ్ర‌హం

407
0

హుబ్లి : బిజెపి టీ అమ్ముతూ డబ్బు సంపాదిస్తుందా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత మంది బిజెపి నేత‌ల ఇళ్ల‌లో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టంపై ఆయ‌న తీవ్రంగా వ్యాఖ్యానించారు. రూ.78ల‌క్ష‌లతో ప‌ట్టుబ‌డిన బిజెపి నాయ‌కుడు ఏప‌ని చేసి సంపాదించాడ‌ని ప్ర‌శ్నించారు. అవినీతి ర‌హిత పాల‌న అంటూ చెప్పుకునే మోడీ దీనికి స‌మాధానం చెప్పాల‌న్నారు. దేశభక్తిపై తనకు మోడీ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు. దేవెగౌడ ప్ర‌ధానిగా ఉండ‌గా కశ్మీర్‌లో ఒక్కదాడి కూడా జరగలేదన్నారు. అది తమ ఘనతన్నారు. క‌ర్నాట‌క‌లో త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తుంద‌న్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోడీ బాలాకోట్‌ దాడుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని కుమారస్వామి ప్రశ్నించారు. సైనిక దళాలను కూడా మోదీ రాజకీయం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. గతంలో పాకిస్థాన్‌కు వెళ్లిన ఆయన అక్కడ ఎలాంటి హామీలు ఇచ్చారోన‌ని తీవ్రమైన‌ వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణలో త్యాగం చేస్తున్న‌ జవాన్లు పేద కుటుంబాలకు చెందినవారని తాను చేసిన వ్యాఖ్యల్ని మోదీ అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. త‌న‌ వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్ రైతుల‌కు ఏమీ చేయాలేకపోయిందన్న మోదీ వ్యాఖ్యల్ని ఖండించారు. తాము రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగ కల్పన, అవినీతి నిర్మూలన హామీలతో అధికారాకి వచ్చిన మోడీ ఏం చేశార‌న్నారు. మోదీ ఒక‌ అసమర్థ ప్రధాని అని ఆరోపించారు. క‌ర్నాట‌క‌లో ఉన్న 28లోక్‌సభ స్థానాల్లో 14స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. మరో 14సీట్లకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది.