Home జాతీయం కేంద్రంపై కుమారస్వామి మండిపాటు

కేంద్రంపై కుమారస్వామి మండిపాటు

373
0

బెంగళూరు : మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు పూనుకుంది జనతాదళ్‌(ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెంగుళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి యేతర పార్టీలన్నీ ఏకమై దేశాన్ని రక్షించుకునేందుకు పోరాడాల్సిన సమయం వచిందన్నారు. మెజార్టీ లేకపోయినప్పటికీ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ఆహ్వానించడాన్ని ఆయన తప్పుబట్టారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు.

‘కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అని ప్రశ్నించారు. మెజారిటీ ఉందని తామందరం వెళ్లి గవర్నర్‌ను కలిశామన్నారు. ఆయన తమకు మాత్రం అవకాశం ఇవ్వలేదన్నారు. మెజారిటీ లేని వాళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడంతోపాటు బలాన్ని నిరూపించుకునేందుకు 15రోజుల గడువు ఇవ్వడం ఎందుకని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు 15రోజుల గడువు ఇవ్వడానికి కారణమేంటి? ఇదేమైనా వ్యాపారమా?’ అని ఆయన ప్రశ్నించారు.

‘ప్రభుత్వ సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం తమ అవసరాలకు ఉపయోగించుకుంటూ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈడీ సహకారంతో మా ఎమ్మెల్యేలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ను ఈడీ అధికారులు ఇదే విధంగా బెదిరింపులకు దిగుతూ వాళ్ల వైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సింగ్‌పై ఉన్న పెండింగ్‌ కేసును ఉపయోగించి అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు’ అని కుమారస్వామి మండిపడ్డారు.

‘బిజెపి చర్యలను అడ్డుకునేందుకు దేశంలోని అన్ని ఇతర పార్టీలు ఏకమవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీల నేతలందరూ చేతులు కలిపి పోరాడాల్సిన అవసరం, సమయం వచ్చిందన్నారు. తన తండ్రి దేవెగౌడ సారథ్యంలో మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్‌ రావు, మాయావతి, నవీన్‌ పట్నాయక్‌.. అంతా ఒక్కటై పోరాటం చేయాలి’ అని ఆయన సూచించారు.