టంగుటూరు : ఏం అశోక్ కలవడం లేదు ఏంటి? పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారా అంటూ వైసిపి అధినేత వైఎస్ జగన్ కొండెపి వైసీపీ నాయకులు వరికూటి అశోక్ బాబును ఆప్యాయంగా పలకరించారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర లో ఉన్న జగన్ ను అశోక్ కలిసి మాట్లాడటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ అడిగిన దానికి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నానని అశోక్ చెప్పాడు. వారిరువురూ పాదయాత్రలో నడుచుకుంటూనే ఇలా మాట్లాడుకున్నారని కార్యకర్తలు చరించుకుంటున్నారు. అవి… వారి మాటల్లోనే…
జగన్ : అయితే ఈ మధ్యలో ఇప్పటి వరకు నన్ను ఎందుకు కలవలేదు.
అశోక్ : నన్ను సస్పెండ్ చేశారు. పార్టీ నుండి బహిష్కరణ కూడా చేశారు కదా… అందుకనే కలవలేదు.
జగన్ : సస్పెండ్ చేశారా? ఎవరు సస్పెండ్ చేశారు? (ఆశ్చర్యంగా)
అశోక్ : నన్ను బహిష్కరించారని మన సాక్షి పేపర్లో కూడా వచ్చింది. అందుకనే జిల్లా నేతల అనుమతి లేకుండా కలవకూడదని మిమ్మల్ని కలవలేదు. అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నా.
జగన్ : అయినా నన్ను కలవాలికదా… పార్టీ మీది. మీరు కలువకపోవడమెంటీ? ఇక్కడ ఎవ్వరినీ సస్పెండ్ చేసే అధికారం లేదు. సస్పెండ్ కి కారణం తెలపాల్సి ఉంటుంది. అలాంటివి నీవు చేయలేదు కదా? ఏమి లేనప్పుడు నీకెందుకు. నీవు వచ్చి కలవాల్సింది. పదిరోజులలో కొండపి విషయాన్ని పూర్తిచేద్దాం. మీ నాయకులను తీసుకుని హైదరాబాద్ రండి. మీరు వస్తే అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. అక్కడ జరుగుతున్న విషయాలు నాకు తెలియాలి కదా. జిల్లా పెద్దలు కూడా నన్ను కలిసి 40 రోజులయింది. కనీసం మీరన్నా నాకు చెప్పాలి కదా…!
అశోక్ : ఇప్పుడు కూడా మిమ్మల్ని చూద్దాం అని వచ్చా…
జగన్ : పార్టీ మీది తలెత్తుకొని నా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు. ఏ సీటు పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క సీటు నాకు ఎంతో ముఖ్యం. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే సీటు ఇస్తా…
అశోక్ : అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై, ప్రతిరోజు, ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నా… అందుకనే మిమ్మల్ని కలవలేక పోయా…
జగన్ : అక్కడి విషయాలు అన్నీ నాకు తెలియట్లేదు. అశోక్ : పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ ఏ పని చేయలేదు. పార్టీకి ఇబ్బంది లేకుండా, ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నా… పార్టీని అక్కడున్న కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో సంబందాలు ఉన్న నాయకులు తెలుగుదేశం వాళ్ల చేతుల్లో పెడుతున్నారు.
జగన్ : 4 రోజుల తర్వాత పాదయాత్ర అయిపోతుంది. తర్వాత హైదరాబాద్ వచ్చి కలువు. సర్వేలు రిపోర్టులు వస్తాయి. సర్వేలు వచ్చిన తరువాత సీటు ఎవరికి ఇవ్వాలో తెలుస్తుంది.
ఇలాంటి సంభాషణలు సుమారు 20నిమిషాల పాటు పాదయాత్రలో ఇద్దరు నడుచుకుంటూనే మాట్లాడుకున్నట్లు కొండెపిలో ప్రచారం జరుగుతుంది. అశోక్ బాబు వెంట వైసీపీ ఐటీ విభాగం మాజీ అధ్యక్షులు పమ్మి శేషిరెడ్డి వున్నారు.