Home ప్రకాశం టిడిపి, వైసీపీ, బిజెపికి ప్రత్యామ్నాయం వామపక్షాలు, జనసేన : సిపిఐ మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్

టిడిపి, వైసీపీ, బిజెపికి ప్రత్యామ్నాయం వామపక్షాలు, జనసేన : సిపిఐ మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్

649
0

టంగుటూరు : టిడిపి, వైసిపి, బిజెపికి ప్రత్యామ్నాయంగా సిపిఎం, సిపిఐ, జనసేన కూటమిని బలపర్చాలని సిపిఐ మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ కోరారు. కొండపి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యామ్నాయ రాజకీయ మేనిఫెస్టోను సిపిఐ, సిపిఎం, జనసేన నేతలు ఆవిష్కరించారు. స్థానిక పురం సెంటర్ నుండి ప్రదర్శన, అనంతరం కొండేపి రోడ్డులో బహిరంగ సభ నిర్వహించారు.

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జాబు కావాలంటే బాబు రావాలి అనే రాతలు అన్నీ ఈ రోజు తుడిచివేశారన్నారు. ఇప్పుడు అవేమి మాట్లాడడం లేదన్నారు. 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్న బాబు-జాబు అని గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఈ రోజు ప్రజలు అడుగుతారని ఎక్కడా కనిపించకుండా చేశారన్నారు. కానీ ప్రజలు మాత్రం గుర్తు చేస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో మరో ప్రగతిశీల ప్రత్యామ్నాయ, ప్రజలకు మేలుచేసే నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అటువంటి ప్రజా రాజకీయ పక్షాలను గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలను ఇదే పద్ధతిలో ఇంటింటికి వెళ్లి, ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రణాళికను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. రాబోవు ఎన్నికల్లో గెలిచి సిపిఐ, సిపిఎం, జనసేనలు అధికారంలోకి వస్తే రైతు, కూలీ, ఉద్యోగుల, ప్రజల సామాజిక సమస్యల ప్రణాలిక అమలుకు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి కట్టుబడి పని చేస్తారని చెప్పారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలను అంగీకరించబోమని అన్నారు. సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. అవకాశవాద, ధనరాజకీయాలు చేసేందుకు టిడిపి, వైసిపి చేస్తున్నాయన్నారు. ఓసి స్థానాల్లో 20 కోట్లు, బిసి స్థానాల్లో 15 కోట్లు, ఎస్సి స్థానాల్లో 10 కోట్లు పెట్టుబడి పెట్టేవారికే సీటు ఇవ్వాలని రెండు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా బేరం పెట్టాడో అన్నారు. జగన్ కూడా డబ్బు లేని వ్యక్తులను పక్కనపెడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కాలంలో దోచుకున్న డబ్బు రేపు జరగబోవు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాను గత మూడు, నాలుగు సంవత్సరాలుగా జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని అడుగుతున్నా పట్టించుకోలేదన్నారు.

రాష్ట్రంలో 650 మండలాలు ఉంటే 350 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన చంద్రబాబు ఒక్క మండలంలోనైనా కరువు పనులు ప్రారంభించారాని ప్రశ్నించారు. ఉపాధి పనులు అదనంగా చేపట్టారా?కనీసం వెలుగొండ పూర్తి చేసి త్రాగు, సాగు నీరు అందించారా? అందుకే కరువు పనులు చేపట్టని చంద్రబాబు శంకరగిరిమాన్యాలు పట్టేలా బుద్ధి చెప్పాలని కోరారు.

జనసేన జిల్లా కోఆర్డినేటర్ చీకటి వంశీదీప్ మాట్లాడుతూ మీ కుటుంబం కాకపోతే మా కుటుంబం, మా కుటుంబం కాకపోతే మీ కుటుంబం అంటూ అధికార మార్పిడి చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రం రెండు కుటుంబాల చేతుల్లో అల్లకల్లోలంగా మారిందన్నారు. నేడు నూతన రాజకీయ పక్షాలతో కలిసి జనసేన ప్రయాణించడానికి శ్రీకారం చుట్టిందన్నారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా వామపక్షాలతో కలిసి జనసేన నడుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐలతో కలిసి జనసేన అన్ని ప్రజా ఉద్యమాలలో ముందు ఉంటుందన్నారు. బిజెపి, టిడిపిలు ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని మోసపు మాటలు చెప్పాయన్నారు.

రామాయపట్నం పోర్టు, వెలుగొండ, దొనకొండ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు పేర్లతో టీడీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అమరావతిలో జనసేన, సీపీఎం, సీపీఐ జెండాలు ఎగురవేద్దామన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోయి పొగాకు, శెనగ, ఇతర పంటల రైతులు అల్లాడుతుంటే ఎమ్మెల్యే శోద్యం చూస్తున్నాడని ఆరోపించారు. జిల్లాకు రావాల్సిన సాగర్ నీటిని రాయలసీమకు పంపి జిల్లాని అధోగతిపాలు చేశారన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు సాధించిన ఘనత ఏమిటన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి 94 వేల కోట్లు అప్పు ఉంటే ఈ రోజు రూ.2.40లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారానికి వస్తే రాష్ట్ర ప్రజలను మరింత అప్పుల ఊబిలోకి నెడతారన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలను ఎప్పుడూ పట్టించుకోని చంద్రబాబును ఇంటికి పంపకపోతే రాష్ట్రం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

సభకు సీపీఎం నాయకులు టి రాము అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కమిటీ సభ్యులు బొటుకు రమేష్ బాబు, సీపీఎం కొండపి నియోజకవర్గ కన్వీనర్ కంకణాల ఆంజనేయులు, సీపీఐ కొండపి నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు మోజెస్, కెజి మస్తాన్, టి ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఎం, సీపీఐ సాంస్కృతిక బృందాలు, ప్రజాసమస్యలపై ఆలపించిన పాటలు ఉత్తేజ పర్చాయి.