కొండపి : రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ వైస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని ప్రారంభించారని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. కొండపి మండలం నేతివారిపాలెంలో రూ.84లక్షల నిధులతో నిర్మించనున్న సచివాలయ భవన నిర్మాణానికి డాక్టర్ వెంకయ్య భూమి పూజ చేశారు. కొండపి ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన వైస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం, వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వాలంటీర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాలలో చిన్న పిల్లలు, గర్భిణీలు,
బాలింతలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ముందు చూపుతో వైస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ప్రారంభించారని చెప్పారు. ఈ పథకం ద్వారా నెలకు 24 కోడిగుడ్లు, పోషకాహార పదార్థాలు ఉండే కిట్ ను అందజేస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలకు పోషకాహార కిట్ లు అందజేశారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను ప్రశంసించారు. వాలంటీర్లకు గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల, మత తేడాలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించి జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతివారిపాలెం వైస్సార్ సీపీ నాయకులు గోగినేని వెంకటేశ్వర్లు, ఉపేంద్ర, పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.