కొండేపి : నూతన తాసిల్దార్ గా జీవి గుంట ప్రభాకరరావును జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీకి కొండేపి నియోజకవర్గంలో (టంగుటూరు, పొన్నలూరు) భూ సేకరణ ఆటంకంగా మారింది. పేదల నివేదన స్థలాలకు మైనింగ్ భూములను ప్రతిపాదించారు. ప్లాట్లు వేసి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే మైనింగ్ భూములను ఎలాంటి ఇతర అవసరాలకు వాడవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నివేశన స్థలాల పంపిణీకి కొండేపి నియోజకవర్గంలో భూసేకరణ సమస్య కూడా ఒక కారణమైనది. భూ సేకరణ సమస్య ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసినట్లుగా అధికార పార్టీ నేతల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాసిల్దార్ బదిలీ అయ్యారు.
నిన్నటి వరకు పొదిలి తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జీవిగుంట ప్రభాకరరావు పొదిలి మండలంలో భూసేకరణ ఎలాంటి వివాదాలు లేకుండా చేయడంపై ఉన్నతాధికారులు ప్రశంసించారు. పొదిలి పట్టణానికి సమీపంలో అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు ఏర్పాటు చేయడంతోపాటు సుమారు వంద ఎకరాలకుపైగా పేదలకు పంపిణీ చేసేందుకు సాగు భూమిని కూడా సిద్ధం చేశారు. ఇలా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో నిబద్ధతతో పని చేయడమే ప్రభాకరరావుకు గుర్తింపు తెచ్చింది. తాజాగా కొండేపి నియోజకవర్గంలో నెలకొన్న భూసేకరణ సమస్య నేపథ్యంలో కొండేపి తహసీల్దార్ గా ప్రభాకరరావు, పొన్నలూరు తహసీల్దార్ గా జి సుజాత నియామకం ప్రాధాన్యత సంతరించుకున్నది.