ప్రకాశం : విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా పరిష్కరించి, ఆ శాఖను అగ్రస్థానంలో నిలుపుతారని ఆశించామని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. జిల్లాలో విద్యుత్ సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. విద్యుత్తు శాఖను అగ్రస్థానం ఏమో కానీ గిరిజనులు, దళితులపై తమరు ఉక్కుపాదం మోపుతారని ఆరోపించారు.
కొండేపి మండలంలోని నెన్నూరుపాడులోని 13 గిరిజన, యానాది కుటుంబాలకు గృహ విద్యుత్తు కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి సర్వీస్ కనెక్షన్ మంజూరు చేసి మీటర్ల బిగించడానికి విద్యుత్ సిబ్బంది వచ్చారు. తర్వాత ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకుల ఒత్తిడి మేరకు ఆ మీటర్లు బిగించవద్దని మీ ఆదేశానుసారం విద్యుత్ శాఖ అధికారులు ఆ మీటర్లు బిగించకుండా లైన్ మెన్ వెనక్కు తీసుకెళ్లి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో చేర్చి ఇప్పటికి ఆరు నెలలు అవుతుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులను అడిగితే బిగిస్తాములే అంటూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు. సాక్షాత్తూ మంత్రే తమపై కక్షగడితే ఏమీ చేయగలమని ఆ 13కుటుంబాలు చీకట్లోనే మగ్గుతున్నారని తన దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. మీరు చెప్పారని టంగుటూరు మండలం వెలగపూడి ఎస్సీ కుటుంబానికి చెందిన డి ధనలక్ష్మికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మంత్రి స్థాయిలో ఉన్న మీరు సామాన్యులపై కక్షసాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సబబని, టీడీపీ సానుభూతి పరులనో లేక ఇంకేదైనా కారణం చేతనో మీ పార్టీ కార్యకర్తలు చెప్పారనో, అర్హులకు అన్యాయం చెయ్యొద్దని కోరారు. పై విషయాలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ఎమ్యెల్యే స్వామి కోరారు.