టంగుటూరు : వైసీపీ అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు జరుగుతున్నాయని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బ్రతికారని తెలిపారు. కానీ వైసీపీ పాలనలో కనీసం గొంతెత్తి తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని అన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షతో దళిత లెక్చరర్ ప్రేమానందంపై దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండింస్తున్నట్లు పేర్కొన్నారు. దళితులు టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాస్కుల్లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని ఉగ్రవాది కంటే ఘోరంగా హింసించి బంధించారన్నారు. పిచ్చివాడిగా ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్ లో చేర్చారన్నారు. కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‍పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు.
ప్రభుత్వ వైఫల్యా లను ప్రశ్నించిన మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టారన్నారు. గ్రామాల్లో దళితుల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని అన్నారు. పలు చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలొనే దళితులపై ఇన్ని దాడులు జరిగితే మిగతా 4ఏళ్లలో ఇంకెన్ని దాడులు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. లేకపోతే వైసీపీకి దళితులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.