– 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుతో గెలిచిన పంచాయతీల సర్పంచులకు అభినందనలు
– పచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులకు ఓట్లేసిన ఓటర్లకు ధన్యవాదములు
– పంచాయితీల్లో గెలవడానికి అధికారులను అడ్డంపెట్టుకున్న వైఎస్ఆర్సిపి
ఒంగోలు : 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని టిడిపి మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారని కొండేపి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుతో గెలిచిన పంచాయతీ సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులకు ఓట్లు వేసిన ఓటర్ మహాశయులకు అభివాదాలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి గతంతో పోల్చినప్పుడు గణనీయంగా పెంపొందించుకొని సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని అన్నారు.
కొండేపి నియోజకవర్గంలో 25శాతం సర్పంచులు గెలుచుకున్నామని, 10శాతం టిడిపి మద్దతుతో ఇండిపెండెంట్లు గెలిచారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం వాలంటీర్లతో గ్రామ స్థాయి నాయకులతో ఓటర్లను టిడిపి మద్దతుదారులకు ఓట్లేస్తే నీకు సంక్షేమ పథకాలను ఇవ్వమని భయబ్రాంతులకు గురి చేసి ఓటర్లను మనోవేదనకుగురి చేసి అధికారపక్షం గెలిచిందని ఆరోపించారు. అధికారపక్షం బలవంతంగా భయబ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవాలు సాధించినప్పటికీ టిడిపి కార్యకర్తలు, నాయకులు మనో నిబ్బరంతో ధైర్యంతో పంచాయతీ ఎన్నికల్లో పోరాడారని అన్నారు. వైసిపి గెలిచిన చోట వార్డు సభ్యులుకు వచ్చిన మెజారిటీ, సర్పంచికి వచ్చిన మెజారిటీ గమనిస్తే, వారు ఎన్ని అవకతవకలు చేసి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారో అర్థమవుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులు కచ్చితంగా గెలిచే విధంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులని, వారు వారి విధి నిర్వహణని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాపట్ల పార్లమెంటు రైతు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య, ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ఒంగోలు నగర ఎస్సీసెల్ అధ్యక్షులు నావురి కుమార్, చుండి శ్యాం, పూసపాటి జాలిరెడ్డి పాల్గొన్నారు.