కొండపి : నవరత్నాలు పథకాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 9నెలల్లోనే 9వైఫల్యాలు చెందినదని, వైసీపీకి నవరంధ్రాలు మూసేసి ఇంటికి పంపించే రోజు వచ్చిందని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఏడాది పాలనపై స్వామి ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పరిపాలన మే 23న రాష్ట్ర ప్రజలకు దుర్దినంగా భావిస్తున్నామన్నారు.
ఒకసారి అవకాశం అంటే ఓటేసిన ప్రజలు ఇప్పుడు జగన్ మాకొద్దంటున్నారన్నారు. వైసీపీ మొదటి నుంచి రద్దులు, కూల్చివేతలతోనే కాలం గడిపిందని పేర్కొన్నారు. హైకోర్టు చేత 63సార్లు అక్షింతలు వేయించుకున్న ఘనత జగన్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. వైసీపీ కార్యకర్తలకు వాలెంటర్లుగా, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించి, ఖజానాపై రూ.2400కోట్ల భారం మోపారన్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారన్నారు. ఉపాధిహామీ పధకంలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. విశాఖలో మృతులకు కోటి ఇచ్చి ప్రకాశంలో ప్రమాదంలోని మృతులకు రూ.10లక్షలు అంటూ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. మాస్కులు ఇవ్వమన్న దళిత డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి మానసికంగా, శారీరకంగా దాడి చేసారని చెప్పారు. ఈ విషయంపై సుధాకర్ హైకోర్టుకు వెళితే కోర్టులో మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి కేసును సీబీఐకి అప్పగించిందంటే మీ ప్రభుత్వం మీద కోర్టులకు కూడా నమ్మకం లేదన్నారు. డాక్టర్ సుధాకర్ పై దాడి దళితులపై దాడికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను అమ్మఒడికి మల్లించి దళితులకు రుణాలు ఇవ్వకుండా ద్రోహం చేశారని అన్నారు.
అన్నీ కులవృత్తుల వారికి రుణాలు ఇచ్చి చర్మకారులకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏడాది అధికారంలో 500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు.
శ్మశానాలలో, పోరంబోకు స్థలాలలో ఊరికి దూరంగా ఇండ్లస్థలాలు ఇస్తున్నారని అన్నారు. సీఎం జగన్ తన బాబాయిని తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తగా పెట్టి దేవస్థాన ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే నేపంతో తుగ్లక్ చర్యతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి 60మంది రైతుల మృతికి జగన్ కారణమయ్యాడని పేర్కొన్నారు. రాష్ట్ర ఉద్యోగస్తులుకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోగా సగం జీతాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
సిపిఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి దాని ఊసేపట్టించుకోవటం లేదన్నారు. మద్యపాన నిషేదం ఎందుకు చేయలేదన్నారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచాడన్నారు. క్రొత్తగా ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే మాట తప్పటం, మడమ తిప్పటం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందని చెప్పక తప్పదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టారని కేసులు పెట్టడం టీడీపీపై కక్షసాధింపు చర్య అన్నారు. అమరావతిలో ప్రజావేదిక కూల్చడంతో తన పాలనా సంవత్సరాన్ని ప్రారంభించి, విజయనగరంలో ప్రాచీన చారిత్రాత్మక మూడు లాంతర్ల స్థూపాన్ని కూల్చడంతో ఒక సంవత్సర పాలన ముగించటం శోచనీయమని పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ వైసీపీ నేతలు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ గొర్రెపాటి రామయ్య, టిడిపి మండల అధ్యక్షులు బొడ్డపాటి యల్లమంద నాయుడు, బీసీ నాయకులు నారాయణ స్వామి, వై వెంకటేశ్వర్లు, నరసారెడ్డి, బి సోమయ్య,
మురళి తదితరులు పాల్గొన్నారు.