కొండేపి (దమ్ము) : జగనన్న విద్యాకానుకపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనంతో పెదవి విరుస్తున్నారని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. విద్యాకానుక పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యా కార్యక్రమాన్ని సైతం ఇంతగొప్పగా ప్రచారార్భాటం కల్పిస్తూ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, షూ,
యూనిఫామ్ ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినవేనని చెప్పారు. కొత్తగా ఒక జత యూనిఫామ్, బ్యాగు, టై ఇచ్చేసి విద్యార్థులను ఉద్ధరించినట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న జగనన్న విద్యాకానుకలోని గొప్పతనం ఏమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన యూనిఫామ్ (బట్టలు) నాణ్యతగా లేదని, బ్యాగు కూడా రెండునెలలకన్నా ఎక్కువకాలం పనిచేయదని అన్నారు. అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు అసహనంతో, పెదవి విరుస్తున్నారని అన్నారు. జగన్ ఒకచేత్తో ఇస్తూ, ఇంకోచేత్తో లాగేసుకుంటున్నారని ఆరోపించారు. 8, 9 తరగతుల విద్యార్థినులకు గతంలో చంద్రబాబు బడికొస్తా పథకం కింద సైకిళ్లు అందించారని, జగన్ అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని రద్దుచేశాడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థలలో కార్పొరేట్ విద్య అందించాలని ప్రవేశ పెట్టిన బెస్ట్ అవైలబుల్ పథకాన్ని ఎందుకు రద్దుచేసారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు రంగులేసి, బ్యాగులిచ్చేస్తే, విద్యార్థుల జీవితాలు ఎలా బాగుపడతాయో వైసీపీనేతలు చెప్పాలన్నారు.
పేదవిద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించే విదేశీ విద్యాదీవెన పథకాన్ని నిధులులేవని జగన్ నిలిపేశారన్నారు. ప్రజల డబ్బుతో పెట్టిన పథకాలకు మీస్వంత పేర్లు పెట్టారంటూ విమర్శలు చేసిన వైసీపీనేతలు, ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చిన బెల్టులపై జగన్ బొమ్మవేయడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పాతపథకాలకు పేర్లుమార్చి, రంగులద్ది అమలుచేయడం తప్ప, విద్యాప్రమాణాలు పెంచే ఆలోచన వైసీపీ చేయడం లేదన్నారు. జగనన్న విద్యాకానుక పథకం కొత్తసీసాలో పాతసారా వంటిదని అభివర్ణించారు.