హైదరాబాద్ : టిడిపి మహాకూటమి జట్టుకు ‘తెలంగాణ జన సమితి’ (టిజెపి)తో బందానికి దారి దొరికింది. పెట్రో మంటలపై నిరసన బంద్‌లో టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండ రామ్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతే పోలీసు స్టేషన్ ఇరుపార్టీల నేతల మాటలు కలిశాయి. రానున్న ఎన్నికల్లో టిడిపి తెరపైకి తెచ్చిన మహాకూటమిలో చేరేందుకు సిపిఐతోపాటు మరో మిత్రుడు టిడిపికి తోడయ్యాడు. అతనే టిజెపి కోదండరామ్. సోమవారం ఒక్కరోజులోనే రెండు విడతలు చర్చలు జరిగాయి.
ప్రాధమికంగా చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో చర్చించుకున్న ఇద్దరు నేతలు స్టేషన్ నుండి విడుదలై ఇంటికి వెళ్లిన తర్వాత సాయంత్రం మళ్లీ హోటల్‌లో కలుసుకున్నారు. రెండోసారి హోటల్‌లో జరిగిన భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, టిజెపి నేత విద్యాధర్‌రెడ్డి, టిడిపి నేత పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మూడుపార్టీల నేతలు మహాకూటమిపై ప్రాథమిక చర్చలు జరిపారు. ‘అధికార దుర్వినియోగం జరుగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టిఆర్ఎస్‌ను ఓడించాలి.. అందుకు ప్రతిపక్షాల్లో ఉన్న అందరూ కలసి పోటీచేస్తేనే అది సాధ్యం’ అని నేతలు అన్నారు. కూటమిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ముగ్గురూ కలసి కాంగ్రెస్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నారు. నాలుగు పార్టీల నేతలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేయాలనుకున్నారు. కలిసి పోటీ చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎవరెన్ని సీట్లకు, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలను మరోసారి కూర్చుని చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని సీట్లు వదులు కోవాల్సి వచ్చినప్పటికీ కలిసి పోటీ చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.