– సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు: తాడివలస దేవరాజు
– ఘనంగా కరుణానిధి జయంతి
చీరాల : హైమా హాస్పటల్ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి, కళైనార్ డాక్టర్ కరుణానిధి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హైమ హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కరుణానిధి కవిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా రాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. యువకుడిగా ఉన్నపుడే కవిగా తన కవిత్వంతో, మాటలతో ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పారు. ఆరోజుల్లో సమాజంలో ఉన్న వివక్ష, మూఢనమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. ద్రవిడ సూర్యుడు, ద్రవిడ ఉద్యమ నేత, రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తన 60ఏళ్ల రాజకీయ జీవితంలో (13 సార్లు) ప్రతి ఎన్నికల్లో గెలిచి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన నాయకుడని కొనియాడారు.
శ్రీ కామాక్షి హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు మాట్లాడుతూ కరుణానిధి ఆత్మగౌరవ ఉద్యమాలలో తనదైన ముద్ర వేసి పెరియార్ రామస్వామి అనుచరుడుగా ఎదిగి తమిళనాడులోనే కాక జాతీయ రాజకీయలలో కూడా తనదైన ముద్ర వేసిన రాజకీయ దురందురుడు, సామాజిక న్యాయం కోసం, పేదల అభివృద్ధి కోసం చివరి వరకు పోరాడిన గొప్ప పోరాట యోధుడు కరుణానిధి అని అన్నారు. నాయి బ్రాహ్మణ జాతికి ఆదర్శనీయుడు కరుణానిధి చూపిన బాటలో నడుస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడటమే ఆయనకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కొల్లిపర వెంకటేష్ మాట్లాడుతూ నాడు మండల్ ఉద్యమంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో తనదైన ముద్ర వేసిన పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాంతం కృషి చేసిన ప్రజా నాయకుడు, స్వయంప్రకటిత నాస్తికుడు, కళైనార్ అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే వారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నరేంద్ర, మురళి, ఖాజా పాల్గొన్నారు.