టంగుటూరు : కారుమంచి గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గ్రామస్తులను కోరారు. గ్రామంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన చేతిపంపులు, (బోర్లు) ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా తన స్వగ్రామమైన కారుమంచిని అభివృద్ధి పథంలో నడిపి ఆదర్శగ్రామం చేసేందుకు కృషిచేస్తానన్నారు.
కారుమంచి మా ఊరు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా తన సొంత నిధులు వెచ్చించి గ్రామంలో 4 చేతిపంపులు (బోర్లు) మరమ్మత్తులు చేయించానన్నారు. వేసవి నేపథ్యంలో గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు వీటిని వాడకంలోకి తెచ్చేందుకు పూనుకున్నాన్నన్నారు. కారుమంచిలో బహిరంగ మద్య సేవనాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తానన్నారు. అనధికార మద్యం విక్రయాలు గ్రామంలో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. కొందరు మద్యంప్రియులు ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రిళ్లు మద్యం సేవిస్తున్నట్లు, హైదరాబాద్ నుండి అక్రమ మద్యాన్ని తీసుకొస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఇలాంటి కార్యకలాపాల్ని ఎలాంటి పరిస్థితుల్లో సహించబోమని, అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని లక్ష్మణరెడ్డి హెచ్చరించారు. మద్యం ధరలు పెంచడం, మద్యం షాపులను తగ్గించడం, బెల్టుషాపుల నిర్మూలనలతో రాష్ట్రంలో మద్యం వినియోగం 25శాతం తగ్గిందన్నారు. కరోనా సమస్య తగ్గిన తర్వాత మద్యం దుష్ఫలితాలపై బహుముఖ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ మామిళ్లపల్లి రవికుమార్, కారుమంచి గ్రామ మాజీ సర్పంచ్ ఆనం సత్యనారాయణరెడ్డి, గ్రామపెద్దలు చిట్టేల రామిరెడ్డి, మన్నం శ్రీను, బత్తుల కృష్ణ, కందుల రాజారావు, దోనెంపూడి జయరావు పాల్గొన్నారు.