‘‘ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాలి’’ అంటూ నటి జ్యోతిక గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జ్యోతిక వ్యాఖ్యలపై ఒకవైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వస్తున్న సమయంలో.. ఆమె భర్త, ప్రముఖ నటుడు సూర్య మంగళవారం బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.
‘‘చెట్టు ఊరకున్నా గాలి వదిలిపెట్టేలా లేదు అనే సామెత సోషల్ మీడియా వివాదాలకు సరిపోతుంది. ఒక అవార్డు ఫంక్షన్‌లో ఎప్పుడో జ్యోతిక చెప్పిన వ్యాఖ్యలను ఇప్పుడు లాక్‌డౌన్ వార్తగా సోషల్ మీడియలో వివాదాస్పదంగా మారింది. ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులు కూడా అభివృద్ధి చెందాలన్న జ్యోతిక మాటల్ని కొందరు కుట్రగా చూస్తున్నారు. ఇదే సందేశాన్ని వివేకానందుడు వంటి ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. ప్రజలకి చేసే సాయం భగవంతుడికి చేరే కానుకగా అని ‘తిరుమూలర్’ కాలంలోని నానుడి. మంచి విషయాలను చదవని, విననివాళ్లకి ఇది తెలిసే అవకాశం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులను దేవాలయాలుగా చూడాలన్నది అన్ని మతాలకు చెందినవారు ఆహ్వానిస్తున్నారు. కరోనా వైరప్ వ్యాప్తి కారణంగా జనజీవనం స్తంభిస్తున్న ఈ సమయంలోనూ మాకు వేర్వేరు వర్గాల నుండి మద్ధతు లభించడం నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు.
‘ఓటీటీ’ ప్లాన్‌కి మద్ధతు… ఇదిలా ఉండగా, జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన ‘పొన్‌మగళ్ వందాల్’ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలన్న నిర్ణయానికి, ఇతర నిర్మాతల నుండి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ముప్పై మందికిపైగా నిర్మాతలు సూర్య నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను కూడా మద్ధతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ, ‘ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు సినిమా విడుదలకు అవకాశమున్న మార్గాలను అన్వేషించడంలో తప్పేం లేదు. ‘పొన్‌మగళ్ వందాల్’ మార్చి నెలాఖరులో విడుదలై ఉంటే ఏప్రిల్‌లో థియేటర్లలో ఆడి, మే నెలలో ఓటీటీలో విడుదలై ఉండేది. కానీ, కరోనా లాక్‌డౌన్ కారణంగా అలా జరగలేదు. సినిమాలను విడుదల చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈలోపు నిర్మాతకి భారీ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ‘పొన్‌మగళ్ వందాల్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకోవడం తప్పేమి కాదు.’ అని అన్నారు.