చీరాల : సెప్టెంబర్ 9, 10తేదీలలో చీరాలలో జరగనున్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మురళిధర్ కోరారు. స్థానిక ఎన్‌జీవో కార్యాలయంలో ఆయన మీడియాతో సోమవారం మాట్లాడారు. శాస్త్రీయ సమాజాన నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదిక ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య వంతులను చేస్తుందన్నారు. మూఢనమ్మకాలను పాల ద్రోలెందుకు కృషి చేస్తోందని అన్నారు. సమకాలీన దేశ పరిస్థితుల్లో ప్రజలలో శాస్త్రీయ ఆలోచన విధానం పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శాస్త్రవిజ్ఞాన అంశాలపై జరగనున్నజెవివి రాష్ట్ర మహాసభలకు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సైన్స్ ప్రపంచ ప్రజల ఉమ్మడి ఆస్తి అని అన్నారు. సూడో సైన్సు భావాలను ఖండించాలని కోరారు. సమాజ వృద్ధికి ప్రజల్లో సైన్స్ ఆలోచన పెంపొందించుటకు ఈ మహాసభలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కె సుభాని, గాదె హరిహరరావు, చిన్నబాబు పాల్గొన్నారు.