Home బాపట్ల లబ్ధిదారులకు న్యాయం చేస్తా : ఎమ్మెల్యే కొండయ్య

లబ్ధిదారులకు న్యాయం చేస్తా : ఎమ్మెల్యే కొండయ్య

47
0

చీరాల (Chirala) : ఆటోనగర్ (Atonagar) భూములు నిజమైన లబ్ధిదారులకే చెందాలని, వారికి అండగా న్యాయం చేస్తానని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య (MLA Kondaiah) అన్నారు. చీరాల తాలూకా ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆయనను ఆదివారం కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ 1995 నుంచి ఎపిఐఐసికి (APIIC) డీడీలు కట్టి, స్థలాలు తమ సొంత ఖర్చులతో సంరక్షించుకుంటూ వచ్చిన వాస్తవ లబ్ధిదారులైన ఆటోమొబైల్ కార్మికులకు ఈ స్థలాలు కేటాయించకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడం అన్యాయమని తెలిపారు. గతంలో శాసన సభ్యులు ఈ స్థలాల అభివృద్ధికి రోడ్లు, విద్యుదీకరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో సహకరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొందరు బ్రోకర్లు రంగప్రవేశం చేసి ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఫ్లాట్లు చొప్పున అక్రమ అగ్రిమెంట్లు చేస్తున్నారని వివరించారు.

ఇది పూర్తిగా అన్యాయమని యూనియన్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ స్థలాలు వాస్తవ లబ్ధిదారులైన చీరాల ఆటోమొబైల్ కార్మికులకే కేటాయించాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన అక్రమ అగ్రిమెంట్లను రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. స్థానికులకు కాకుండా ఇతరులకు స్థలాలు ఇవ్వడం సరికాదని అన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు న్యాయమైన పరిష్కారం తీసుకువస్తానని అన్నారు. మొదటి నుంచి డీడీలు కట్టిన వాస్తవ లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి కొండయ్య, సంఘ నాయకులు శంకర్రావు, దావూద్ భాషా, సలీం, ఇంతియాజ్, సమద్, బుడే సాహెబ్ హుస్సేన్, సాంబయ్య పాల్గొన్నారు.