అమరావతి : సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు వైస్సార్సీపీలో చేరారు. జనసేనకు ఆకుల రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఆ తర్వాత మర్చిపోతారని అన్నారు. కానీ పాలనకు అదే గీటురాయిగా చేసుకున్న వ్యక్తి జగన్ అని అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా రుణాలు, రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. వాహన మిత్రతో ఇచ్చిన మాట నిలుపుకున్నారని పేర్కొన్నారు. తాను కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని వైసీపీలో చేరానని పేర్కొన్నారు. మద్యనిషేదంలో గతంలో చాలా మంది హామీ ఇచ్చారు కానీ జగన్ మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారని అభినందించారు.
మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మంచింపరిపాలన కావాలని, జగనన్న రాజన్న పాలన తెస్తాడాని జనం ఆశీర్వదించారని అన్నారు. టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజా నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే అన్నారు. తాము తప్పిపోయిన గొర్రెల్లాగా బయటకు వెళ్లొచ్చు కానీ జగన్ తన సంకల్పాన్ని కొనసాగించారని అన్నారు. 5 గురు దళితులకు కాబినెట్ లో స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఇది ఆదర్శంగా తీసుకుందన్నారు. పెట్టిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎదుగుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని అన్నారు. ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరు ఆహ్వానించాలని అన్నారు. తనవైపు నుండి పొరపాట్లు ఉన్నాయని, అందుకే సరిదిద్దుకుంటాను అన్నారు.