హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర తెలుగు దినపత్రిక మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు.
నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టు కలం యోధునిగా, విజ్ఞానఖనిగా పేరు గాంచిన సీ రాఘవాచారి ఇకలేరన్న వార్త తెలుగు పాత్రికేయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన పార్థివ దేహాన్ని బ్లూప్యాక్స్ సమీపంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యాలయం (మఖ్ధూమ్ భవన్)లోను, తర్వాత విశాలాంధ్ర ఆఫీసులోనూ ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.
సి. రాఘవచారి మరణంతో తెలుగు జర్నలిజంలో గొప్ప సంపాదకులలో ఒకరిని కోల్పోయినట్లయింది. నిబద్ధత, సమగ్రత, నిజాయితీ వంటి ఉన్నత విలువలు కలిగిన పాత్రికేయునిగా చివరి వరకూ కొనసాగారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడిన కమ్యూనిస్టుగా రాఘవాచారికి సీపీఐ పార్టీలో కూడా మంచి గుర్తింపు ఉంది.
ఆయన గురించి తెలిసిన వారంతా ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా’అని పిలుస్తుంటారు. ఆయనతో కలిసి దశాబ్దాల పాటు పనిచేసిన సీనియర్ పాత్రికేయులు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆవిర్భావం నుంచి ఆయన వేల సంఖ్యలో పాత్రికేయులను తన పాఠాలతో తీర్చిదిద్దిన చరిత్ర రాఘవాచారిది.
ఒక్కమాటలో చెప్పాలంటే, రాఘవాచారి మరణంతో వామపక్ష పత్రికా రంగంలో ఒక తరం ముగిసినట్లుగానే భావించాలి. కొత్త తరాన్ని ఆయన ఇష్టపడిన తీరు సమున్నతమైనది. ఆయన హృదయ నైర్మల్యం ముందు గొప్ప సంపాదకులమని భావిస్తున్నవారు సైతం ఆయన మోకాళ్లు కూడా దాటలేరు. ఆయన వృత్తి విలువలు, వ్యక్తిత్వ ప్రమాణాలు ఆదర్శనీయమైనవి.
విశాలాంధ్ర సంపాదకునిగా ఆయన సేవలు చిరస్మరణీయం. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పాత్రికేయంగా భావించారు. నిరుపేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసారు. పూర్తి నిబద్దతతో తన వృత్తిలో రాణించారు. సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా, భావితరాలకు మార్గదర్శంగా నిలిచారు.
మార్క్సిస్టు మేధావి రాఘవాచారి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దేశరాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రమూర్తి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్వ సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.అమర్‌నాధ్ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
రాఘవాచారి మృతి వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కాగా, రాఘవాచారి మరణంపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. ‘‘ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 30 ఏళ్ల పాటు విశాలాంధ్ర సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు రాఘవాచారి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు. రాఘవాచారి మరణం పట్ల సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము’’ అని రామకృష్ణ పేర్కొన్నారు.