టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు..!

    393
    0

    అమరావతి : అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సమయాన్ని వృదా చేసేవారు. ఏ విధంగా అధికారులతో గంటల తరబడి చర్చలు జరిపేవారు. సమీక్షా సమావేశాలు ఏ విధంగా నిర్వహించారు. ఇప్పటికీ.. అదే విధంగా చంద్రబాబు తనకు కనిపిస్తున్నారని.. అధికారం కోల్పోయాక కూడా ఆయనలో మార్పు రాలేదని.. ఒక ఇంటర్యూలో జేసీదివాకర్‍ రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

    పది నిమిషాల్లో ప్రసంగం ముగించాల్సి ఉంటే… వంద నిమిషాలు ఇప్పటికీ సమయం తీసుకుంటున్నారని.. గంటలు గంటలు సమయాన్ని వృదా చేస్తున్నారని.. జేసీ దివాకర్‍ రెడ్డి చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఎవరైనా ఆయనను కలిసేందుకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు. మొన్న ఆ మధ్య మీ కుటుంబంలో వారికి ఆరోగ్యం బాగోలేదని విన్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం ఎలా ఉందని కనీస మర్యాద పూర్వకంగా కూడా చంద్రబాబు ఇప్పటికీ అడగరని జేసి ఆ ఇంటర్యూలో చంద్రబాబును నిష్టూరమాడారు.

    దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్‍ రాజశేఖర్‍రెడ్డిలను ఎవరైనా కలిసేందుకు వచ్చినప్పుడు ఆప్యాయంగా ఎప్పుడు వచ్చారు. ఎక్కడ దిగారు. భోజనం చేశారా. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు. ఏ పని మీద వచ్చారని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా తెలుసుకునేవారు.

    అలాంటి అలవాటు చంద్రబాబులో తాను ఇంత వరకు చూడలేదని, కలిసేందుకు వచ్చిన వారిని ఇష్టమైతే పలకరిస్తారు. ఇష్టం లేకుంటే చూసి చూడనట్లు వెళుతుంటారని, నేను ఎన్ని దఫాలు చంద్రబాబుకు చెప్పినా.. ఆయనలో మార్పు రాలేదని దివాకర్‍ రెడ్డి ఆ ఇంటర్యూలో చంద్రబాబును తప్పుబట్టారు.

    “ప్రస్తుత రాజకీయ నాయకులలో చంద్రబాబు కన్నా సీనియర్‍లు ఎవరూ లేరు. ఆయన 1978లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి మూడేళ్లు మంత్రి పదవి నిర్వహించారు.”
    – 1985 నుండి 89 వరకు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్‍ తరువాత నాయకుడిగా ఎదిగారు.
    – 1990 నుండి 94 వరకు శాసనసభలో ప్రతిపక్ష పాత్రను సమర్దవంతంగా నిర్వహించారు.
    – 1995 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
    – 2004 నుండి 2014 వరకు ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు.
    – 2014 నుండి 2019 వరకు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
    – గత రెండేళ్ల నుండి మళ్లీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

    ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పటికీ తన వైఖరి మార్చుకోలేదని, ఆయనలో ముందు ముందు మార్పు వస్తుందన్న నమ్మకం లేదని ఆ ఇంటర్యూలో జేసి నొక్కి నొక్కి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‍, వైఎస్సార్‍ల వలె కాకపోయినా కనీస మర్యాదపూర్వకంగానైనా కలిసేందుకు వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడగలిగితే వచ్చిన వారు సంతృప్తితో తిరిగి వెళతారు.

    అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా మారకుంటే మళ్లీ జగన్‍ చేతిలో చావు దెబ్బ తినక తప్పదని దివాకర్‍ రెడ్డి ఆ ఇంటర్యూలో హెచ్చరించారు. “నేను చెప్పిన ఈ విషయాలన్నీ పార్టీ నేతలందరి మనసులో ఉన్నాయి. నేను బయట పడి చెబుతున్నాను. మిగతా వారు బయట పడలేకపోతున్నారు. నాకు ఎలాంటి పదవులు అవసరం లేదు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా.”

    “అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దఫాలు చంద్రబాబు పనితీరును ఆయన సమక్షంలో తప్పు పట్టాను. పార్టీ సమావేశాల్లో కూడా తప్పు పట్టాను. ముఖ్యంగా చంద్రబాబు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మేమంతా చిన్న పిల్లలం. ఆయన ఒక్కరే పెద్ద వారు అన్న విధంగా అనుకుంటారు. చంద్రబాబుకున్న రాజకీయ అదికార అనుభవం మాకు లేకపోవచ్చు. మాకు కూడా రాజకీయ, అధికార అనుభవం ఉంది. మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను 30ఏళ్ల నుండి పార్టీలో ఉన్న నేతలను కూడా ఇప్పటికీ చంద్రబాబు చిన్నపిల్లల్లా చూస్తుంటారు. తాను మాత్రమే పెద్దవాడినని అనుకుంటారు.” ఈ అలవాటు చంద్రబాబు ఎంత త్వరగా మార్చుకుంటే..  పార్టీకి అంత మంచి జరుగుతుందని.. ఆ ఇంటర్యూలో జేసి తేల్చి చెప్పటం జరిగింది.